కరోనా… పేరు వినిపించిన ప్రతిసారీ జనం గుండెల్లో తెలియని గుబులు మొదలవుతుంది. ఈ శతాబ్దంలో అతి పెద్ద మహమ్మారిగా నిలిచిపోయే ఇది ఒక్క భారత్‌నే కాదు, యావత్ ప్రపంచాన్నీ వణికించింది. మాయల మరాఠీలా తన రూపాన్ని మార్చుకునే స్వభావంతో ఈ వైరస్ సెకండ్ వేవ్‌లోనూ చాలా ప్రాణాలనే బలిగొన్నది. ప్రస్తుతం మళ్లీ కేసులు పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు కొవిడ్ కొత్త వేరియంట్ ఏంటి, దాని బలమెంత, మన సన్నద్ధత ఎలా ఉండాలి లాంటి విషయాలను చెబుతున్నారు వైద్యనిపుణులు. ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా ఉండటమే మనకు శ్రీరామ రక్ష అంటున్నారు.
దేశంలో కరోనా కేసులు 4000 వరకు చేరుకున్నాయి. కొవిడ్ ఫస్ట్‌వేవ్ తర్వాత 2021లో ఒమిక్రాన్ రూపంలో, తదుపరి దాని ఉప వేరియంట్లుగా అప్పుడప్పుడు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. 2022-2023 మధ్య కాలంలో దాదాపుగా తగ్గుముఖం పట్టిన మహమ్మారి 2024 జనవరిలో మరోసారి జెఎన్.1 రూపంలో కాస్త గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేరియంట్ ప్రజలపై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా కరోనా విసిరిన పంజాతో ఆరోగ్యంగా, ఆర్థికంగాను దెబ్బతిన్న జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో తాజాగా మళ్లీ కేసులు నమోదవుతుండటం, 11 మరణాలు సంభవించడం ఆందోళనలకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ స్వభావమేంటి, దాని లక్షణాలు, వైరస్ తీవ్రత, అందుబాటులో ఉన్న చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలకు సంబంధించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవడం మనందరం జాగ్రత్తగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం వ్యాప్తిస్తున్న కరోనా వేరియంట్లన్నీ ఒమిక్రాన్ నుంచి వచ్చినవే. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ పూర్తిగా కనుమరుగైంది. కాని దాని ఉప వేరియంట్లు అయిన ఎంసీ1.10.1, ఎల్బీ1.3.1, ఎల్ఎఫ్7 మాత్రమే ఉన్నాయి. ఈ ఉప వేరియంట్ల నుంచి పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్లే ప్రస్తుతం దేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. ఈ రకాల్లో 72 జీనోమ్ సీక్వెన్స్‌లను గుర్తించారు. అందులో ముఖ్యంగా జేఎఫ్.7.9 అనే ఉప వేరియంట్ 25 సీక్వెన్స్‌లతో 35 శాతం కేసుల నమోదుకు కారణం అవుతున్నది. ఆ తరువాత ఎక్స్ఎఫ్జీ అనే వేరియంట్ 24 సీక్వెన్స్‌లతో 33.33 శాతం, ఎక్స్ఎఫ్కే అనే వేరియంట్ 15 సీక్వెన్స్‌లతో 20.83శాతం, జేఎన్.1 వేరియంట్ అతి తక్కువగా 2 సీక్వెన్స్‌లతో 2.78 శాతం వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు.
ఈ వేరియంట్లన్నీ ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చినవే కావడం వల్ల వాటికి వేగంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంటుంది. కానీ లక్షణాలు మాత్రం చాలా స్వల్పంగా ఉంటాయి. అందువల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావల్సిన అవసరం లేదు. దవాఖానలో అడ్మిట్ అయ్యే పరిస్థితులు ఉండవు. లక్షణాలు అతి స్వల్పంగా ఉండటం వల్ల దాని ప్రభావం కూడా పెద్దగా ఉండదు.
సాధారణంగా ఇప్పుడు విస్తరిస్తున్న వేరియంట్లు తీవ్ర లక్షణాలకు కారణం కాకపోయినప్పటికీ కొందరు మాత్రం తప్పకుండ జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీరి కుటుంబసభ్యులు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇది అంటు వ్యాధి కనుక వీళ్లు కూడా అలర్ట్‌గా ఉండటం ముఖ్యం. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సహజంగానే జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్నీ అవే అని కూడా ఆందోళన చెందవద్దు.
కరోనా లక్షణాలు ఉన్నవారు స్వీయ ఐసోలేషన్ పాటించడం మంచిది. రోగ నిర్ధారణ పరీక్షలు జరిగేవరకు ఐసోలేషన్‌లోనే ఉండాలి. పాజిటివ్ వస్తే వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ ఐదు నుంచి వారం రోజుల పాటు ఎవరితోనూ సంబంధాలు లేకుండా ఉండటం మంచిది. దాని వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
గతంలో వచ్చిన కరోనా వైరస్‌లో కనిపించిన లక్షణాలే ఇప్పుడూ కనిపిస్తున్నాయి. అయితే చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. పరీక్ష చేస్తే తప్ప వైరస్ నిర్ధారణ జరగదు. వైరస్ వ్యాపికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే ఈ వేరియంట్లో సీజనల్ లక్షణాలే ఎక్కువగా కనిపిస్తాయి.
అవేంటంటే…
మూడు రోజుల్లో పరీక్షలు ప్రస్తుతం నమోదవుతున్న కరోనా వేరియంట్లలో దాదాపు అన్నీ సీజనల్ లక్షణాలే ఉంటున్నాయి. దీనిలో శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసేవి పెద్దగా లేవు. అందుకని జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మూడు రోజులైనా లక్షణాలు తగ్గకపోతే అప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
మహేశ్వర్‌రావు బండారి