Banana | అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. ఇతర పండ్లతో పోలిస్తే చాలా తక్కువ ధరను కలిగి ఉంటాయి. కనుకనే చాలా మంది అరటి పండ్లను తింటుంటారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ పండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే అరటి పండ్లను తినే విషయానికి వస్తే రోజులో ఏ సమయంలో వీటిని తినాలని చాలా మంది సందేహిస్తుంటారు. ఏ సమయంలో ఈ పండ్లను తింటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి, ఏ సమయంలో ఈ పండ్లను తినకూడదు.. వంటి సందేహాలు వస్తుంటాయి. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లను ఉదయం లేదా సాయంత్ర వ్యాయామం చేయడానికి 30 నిమిషాల ముందు తీసుకుంటే మంచిది. అదే శారీరక శ్రమ చేసే వారు అయితే పని చేయడానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. పని మధ్యలో విశ్రాంతి లభిస్తే మళ్లీ పండ్లను తినవచ్చు. కానీ 30 నిమిషాలు ఆగిన తరువాతే పని మొదలు పెట్టాలి. అరటి పండ్లలో తేలిగ్గా జీర్ణం అయ్యే పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి సహజసిద్ధమైన చక్కెరల జాబితాకు చెందుతాయి. ముఖ్యంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి చాలా సులభంగా జీర్ణం అవడమే కాకుండా మన శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తాయి. దీంతో వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసేవారికి కావల్సినంత శక్తి లభిస్తుంది. నీరసం రాకుండా ఉత్సాహంగా వ్యాయామం చేయవచ్చు లేదా పనిచేయవచ్చు. ఉదయం వ్యాయామం చేసే ముందు అరటి పండ్లను తిని చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.
అరటి పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత కూడా తినవచ్చు. కానీ కనీసం 40 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. దీంతో మనం తిన్న బ్రేక్ ఫాస్ట్‌లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఆ తరువాత అరటి పండ్లను తింటే మేలు జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువగా బాగా పండిన అరటి పండ్లను తింటే మంచిది. వీటిల్లో పెక్టిన్ ఉంటుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చూస్తుంది. కాస్త పచ్చిగా ఉండే అరటి పండ్లను కూడా ఈ సమయంలో తినవచ్చు. కానీ బరువు తగ్గాలనుకునే వారు మాత్రమే ఈ పండ్లను తినాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయం చేస్తుంది.
వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయడానికి ముందు మీరు అరటి పండ్లను తిని ఉండకపోతే పని ముగిశాక తినవచ్చు. కానీ వెంటనే తినకూడదు. 30 నిమిషాల పాటు విరామం ఇచ్చి ఆ తరువాత తినాలి. దీంతో శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతుంది. మళ్లీ ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఇక ఆయుర్వేద చెబుతున్న ప్రకారం రాత్రి పూట అరటి పండ్లను తినకూడదు. ముఖ్యంగా కఫం ఉన్నవారు అసలు తినకూడదు. తింటే శరీరంలో శ్లేష్మం అధికంగా చేరి దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అరటి పండ్లను ముక్కలుగా కట్ చేసి ఇతర పండ్ల ముక్కలతో కలిపి సలాడ్ మాదిరిగా తయారు చేసి తింటే ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీంతో వివిధ రకాల పోషకాలను ఒకేసారి పొందవచ్చని వారు అంటున్నారు. ఇలా అరటి పండ్లను తింటూ ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు.