పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్ (పీఏడీ) అనేది శరీరంలో వివిధ అవయవాల వైపు రక్త ప్రవాహాన్ని తగ్గించే పరిస్థితి. ముఖ్యంగా కాళ్లు, పాదాల్లో ఈ సమస్య తలెత్తుతుంది. మన కాళ్ల రక్త నాళాలు (ధమనులు) ఆక్సిజన్, పోషకాలతో సమృద్ధమైన రక్తాన్ని గుండె నుంచి భుజాలు, కాళ్లకు తీసుకువెళ్తాయి. పీఏడీ సమస్య తలెత్తినప్పుడు కాళ్ల ధమనుల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తం సాఫీగా ప్రసారం కాదు. ఇది కాలక్రమంలో ధమనులను ఇరుకుగా మారుస్తుంది. ఇలా కొవ్వు పేరుకుపోవడాన్ని ఆథెరోస్ల్కీరోసిస్ అంటారు. ఇది సాధారణంగా వయసు పెరిగే తరుణంలో కనిపించే రక్త ప్రసరణకు సంబంధించిన సమస్య. నరాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్ వస్తుంది. దీని వల్ల ఆయా అవయవాల్లో నొప్పి, శారీరక చలనం కష్టం కావడం, విపరీత పరిస్థితుల్లో కాలు తీసేయాల్సిన దుస్థితి కూడా పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్‌తో సంభవిస్తుంది. పైగా పీఏడీ తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలి. లేకుంటే గుండెపోటు, పక్షవాతం బారినపడే ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు మరీమరీ జాగ్రత్తగా ఉండాలి.
ఇక పీఏడీకి సంబంధించి ప్రధాన ముప్పు కారకం పొగాకు వినియోగం. కొన్ని అధ్యయనాల ప్రకారం పీఏడీ రోగుల్లో దాదాపు 80 శాతం మందికి ధూమపానం అలవాటుగా ఉండటం గమనించాల్సిన విషయం. పొగాకు వినియోగం పీఏడీ ముప్పును 400 శాతం పెంచుతుంది. అంతేకాదు, ఇతరులతో పోలిస్తే ధూమపానం అలవాటు ఉన్నవారిలో పదేండ్ల ముందే పీఏడీ లక్షణాలు బయటపడతాయి. ఒక్క ధూమపానం మాత్రమే కాకుండా డయాబెటిస్, యాభై ఏండ్లు వయసు దాటడం, కుటుంబ చరిత్ర ఉండటం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, రక్తం గడ్డకట్టే (క్లాటింగ్) రుగ్మత ఉండటం, కిడ్నీ వ్యాధులు కూడా పీఏడీకి ఇతర ముప్పు కారకాలుగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వ్యాధి అమెరికా, ఆఫ్రికా దేశస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ భారతీయులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే.
కాళ్లలో నొప్పి: నడుస్తున్నప్పుడు, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి కలుగుతుంది.
మంట, బలహీనత: పీఏడీ బారినపడ్డప్పుడు కాళ్లలో మంటగా అనిపిస్తుంది. కండరాలు బలహీనంగా అనిపిస్తాయి.
చల్లగా ఉండటం: ఒక కాలు కంటే మరో కాలు చల్లగా ఉండటం.
రక్త సరఫరాలో అడ్డంకులు: కాళ్లు, పాదాలు, తొడల రక్త నాళాల్లో మలినాలు పేరుకుపోవడం వల్ల రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది.
రక్త ప్రసరణలో మార్పు : కాళ్లు పసుపు లేదా నీలం రంగులోకి మారుతాయి.
నాడి కొట్టుకోవడం తగ్గడం: కాళ్లలో, లేదా పాదాల్లో నాడులు కొట్టుకునే పల్స్ స్పష్టంగా వినిపించదు.
వైద్య చరిత్ర, శరీర పరీక్షలు: పీఏడీ సమస్య ఉన్న రోగుల్లో వైద్యులు వారి ఆరోగ్య చరిత్రను అధ్యయనం చేస్తారు. ఈ నేపథ్యంలో వారికి ధూమపానం, డయాబెటిస్ లాంటి వాటి గురించి ప్రశ్నలు వేస్తారు.
యాంకిల్- బ్రాకియల్ ఇండెక్స్ (ఏబీఐ): కాలు, భుజం మధ్య రక్త పీడనాలను పోల్చి ఏర్పడిన అడ్డంకులను అంచనా వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.
అల్ట్రాసౌండ్: డూప్లెక్స్ అల్ట్రాసౌండ్ అడ్డంకులను గుర్తించడంలో, రక్త ప్రవాహాన్ని విశ్లేషించడంలో దోహదపడుతుంది.
యాంజియోగ్రఫీ: రక్త నాళాల్లో అడ్డంకులను కనిపెట్టడానికి డైను చేర్చడం ద్వారా స్కానింగ్ చేయడం.
జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా పీఏడీ ముప్పును తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. దీనికోసం డాక్టర్ల సూచన మేరకు తగిన వ్యాయామాలు చేయాలి. వాకింగ్ ఈ విషయంలో మంచి ఎంపికగా నిలుస్తుంది. పీఏడీ రక్త సరఫరాకు సంబంధించిన సమస్య కాబట్టి గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారానికి ఓటువేయాలి. పండ్లు, కూరగాయలు, ముతకధాన్యాలు, గుండెకు మంచిచేసే ఆహారం భుజించాలి. మందుల విషయానికి వస్తే… యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ లాంటి రక్తాన్ని పలుచగా చేసే ఔషధాలను డాక్టర్ల సలహా మేరకు వాడాలి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గడానికి స్టాటిన్స్ తీసుకోవాలి. అవసరమైతే శస్త్రచికిత్సకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ విధానంలో నరాన్ని తెరిచి స్టెంట్ వేస్తారు. బైపాస్ సర్జరీ ద్వారా రక్తంలో అడ్డంకులను దాటడానికి కొత్తమార్గాలను ఏర్పాటుచేస్తారు.
పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్‌కు డయాబెటిస్ ప్రధాన శత్రువు. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు
జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం పెరిఫెరల్ ఆర్టెరీ డిసీజ్‌పై పలు రకాలుగా ప్రభావం చూపుతుంది.
మధుమేహం ఆథెరోస్ల్కీరోసిస్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ధమనుల గోడల్లో కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది. ప్రత్యేకించి కాళ్లు, పాదాలకు రక్త సరఫరా చేసే మార్గాలకు హానికరంగా పరిణమిస్తుంది.
డయాబెటిక్ న్యూరోపతి కాళ్లు, పాదాల్లో నాడులను దెబ్బతీస్తుంది. దీంతో కాళ్లు, పాదాలు మొద్దుబారినట్టు అయిపోతాయి.
అధిక రక్త ప్రవాహం: డయాబెటిస్ రక్త నాళాల నష్టం ద్వారా శరీరంలో రక్త ప్రవాహ గమనాన్ని దెబ్బతీయడానికి ఆస్కారం ఉంది. దీంతో పీఏడీ లక్షణాలు ఎక్కువవుతాయి.
సంక్లిష్టతల ప్రమాదం: డయాబెటిస్, పీఏడీ రెండు సమస్యలు ఉన్న వ్యక్తుల శరీరంలో సంక్లిష్టతలు మరింత ఎక్కువైపోతాయి.
వాపు: డయాబెటిస్ క్రానిక్ లాయడ్ ఇన్ఫ్లమేషన్తో సంబంధం కలిగి ఉంటుంది. ఇది రక్త నాళాలను మరింత దెబ్బతీయవచ్చు .
డయాబెటిస్ కారణంగా పీఏడీకి సంబంధించిన కొన్ని లక్షణాలు మరుగునపడతాయి. కాబట్టి, డయాబెటిస్ రోగులు తమ కాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానమైన అంశం. కాళ్లలో నొప్పి, కాళ్లు, పాదాలు కదపడం ఇబ్బందిగా ఉండటం, ఒక పాదంతో పోలిస్తే మరొకటి చల్లగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచుకోవడం పీఏడీ నిర్వహణలో అత్యంత కీలకమైన విషయం. జీవనశైలి మార్పు లు: ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత శారీరక కృషి, బరువు నిర్వహణ సరిగ్గా ఉంచుకుంటే రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధూమపానం వదిలించుకోవాలి: ధూమపానం మానేస్తే పీఏడీ ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుంది.
వైద్యులను సంప్రదించాలి: నియమిత సమయాల్లో వైద్యులను సంప్రదించాలి. రక్త నాళాల పరీక్షలు చేయించుకోవాలి. దీంతో పీఏడీని ముందుగానే నిర్ధారించుకోవడానికి దోహదపడుతుంది.
మందులు: వైద్యులు పీఏడీ నిర్ధారణ తర్వాత రోగికి తగిన మందులు సూచిస్తారు.
అవగాహన కలిగి ఉండాలి. వ్యాధి తొలిదశలో ఉన్నప్పుడే జాగ్రత్తపడాలి. సంబంధిత వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలి. పీఏడీ లక్షణాలు నిర్ధారణ జరిగితే వైద్యుడి సలహా మేరకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఇప్పటికే పీఏడీ బారినపడితే… రోగులు తమ పాదాలకు సరిగ్గా సరిపోయే పాదరక్షలు ధరించాలి. కాళ్లు, పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పాదాలను పరిశుభ్రంగా, మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుకోవాలి. కాలిగోళ్లను స్నానం చేసిన తర్వాత మృదువుగా ఉన్నప్పుడే కత్తిరించుకోవాలి. తరచుగా వైద్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు.
– డా॥ ఎస్. శ్రీకాంత్ రాజు
సీనియర్ వాస్కులర్ అండ్ ఎండో వాస్కులర్ సర్జన్
యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ, హైదరాబాద్