Cholesterol | మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా చేరితే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి హార్ట్ ఎటాక్ సంభవిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా చేరడం అనేది ఇందుకు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మనం పాటించే ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవన విధానం వల్లే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతుంటాయి. ఈ క్రమంలోనే కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నవారు ఆహారం విషయంలో అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను అసలు తినకూడదు.
నిత్యం ఉదయాన్నే చాలా మంది ఇడ్లీ, దోశ వంటివి తింటుంటారు. వీటిని అధికంగా తింటే శరీరంలో పిండి పదార్థాలు ఎక్కువగా చేరుతాయి. ఇవి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. కనుక ఉదయం ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ముఖ్యంగా కోడిగుడ్లను తీసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, నూనె పదార్థాలను తినడం తగ్గించాలి. వీటి వల్లే కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతుంది. మద్యం సేవించడం మానేయాలి. ధూమపానం చేయకూడదు. ఉప్పును తగ్గించాలి. సర్వ రోగాలకు ఇదే ప్రధాన కారణం కనుక ఉప్పును తీసుకోవడాన్ని తగ్గించాలి. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పలు ఆహారాలను నిత్యం తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు.
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్ కాగా దీన్నే ఎల్డీఎల్ అంటారు. ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. ఎల్డీఎల్ తగ్గాలంటే హెచ్‌డీఎల్ పెరగాలి. ఇందుకు హెచ్‌డీఎల్‌ను పెంచే ఆహారాలను తినాలి. హెచ్‌డీఎల్‌ను పెంచేందుకు యాపిల్ పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. రోజుకు ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని చెబుతుంటారు. ఆ మాట అక్షరాలా సత్యం అని చెప్పవచ్చు. రోజుకు ఒక యాపిల్‌ను తింటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడడడమే కాదు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఎల్డీఎల్ తగ్గి హెచ్‌డీఎల్ పెరుగుతుంది. గుండె సురక్షితంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోవచ్చు. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. అలాగే బ్లాక్ టీ లేదా గ్రీన్ టీని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గడమే కాదు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఈ రెండు రకాల టీలను రోజూ తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు. హెడీఎల్ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వెల్లుల్లిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఎల్‌డీఎల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్‌ను పెంచుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.