Hemophilia | హీమోఫీలియా అనేది అరుదుగా కనిపించే వారసత్వ రక్తస్రావ వ్యాధి. ఈ వ్యాధిలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోవడంతో చిన్న గాయాలకే ఎక్కువసేపు రక్తస్రావం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎలాంటి గాయం లేకుండానే అంతర్గత రక్తస్రావం కూడా సంభవిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఇది జీవితాంతం శారీరక ఇబ్బందులకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వైద్య రంగంలో వచ్చిన పురోగతితో హీమోఫీలియాను నియంత్రించగలుగుతున్నారని పేర్కొంటున్నారు. హీమోఫీలియాలో ప్రధానంగా రక్తం గడ్డకట్టేందుకు అవసరమైన క్లాటింగ్ ఫ్యాక్టర్లు తక్కువగా ఉంటాయి. హీమోఫీలియా Aలో ఫ్యాక్టర్ VIII లోపం ఉండగా, హీమోఫీలియా Bలో ఫ్యాక్టర్ IX లోపం కనిపిస్తుంది. ఈ కారణంగా చిన్న గాయాలకే అధిక రక్తస్రావం జరుగుతుంది. అలాగే కీళ్లు, కండరాల్లో అంతర్గత రక్తస్రావం జరిగితే దీర్ఘకాలికంగా కీళ్ల నష్టం, నొప్పులు, కదలికల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఈ వ్యాధి తీవ్రత క్లాటింగ్ ఫ్యాక్టర్ లోపం స్థాయిపై ఆధారపడి ఉంటుంది. కొందరిలో శస్త్రచికిత్స లేదా గాయం తర్వాత మాత్రమే సమస్య బయటపడితే, మరికొందరిలో చిన్న వయస్సులోనే లక్షణాలు కనిపిస్తాయి. తరచూ ముక్కు నుంచి రక్తస్రావం, తేలికగా గాయాల మచ్చలు రావడం, చిన్న గాయాలకే ఎక్కువసేపు రక్తస్రావం, మోకాళ్లు, మోచేతులు, కాళ్ల కీళ్లలో వాపు, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మూత్రం లేదా మలంలో రక్తం కూడా కనిపించే అవకాశం ఉంటుంది. శిశువుల్లో సర్కంసిజన్ తర్వాత అధిక రక్తస్రావం జరగడం, తొంగి నడవడం ప్రారంభించినప్పుడు శరీరంపై తెలియని గాయాల మచ్చలు కనిపించడం కూడా ప్రారంభ సంకేతాలుగా భావిస్తారు. హీమోఫీలియాకు పూర్తిస్థాయి శాశ్వత చికిత్స లేకపోయినా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలతో సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా లోపించిన క్లాటింగ్ ఫ్యాక్టర్‌ను శిరామార్గం ద్వారా శరీరంలోకి అందించే రీప్లేస్మెంట్ థెరపీ ఉపయోగిస్తారు. దీన్ని రక్తస్రావం జరిగినప్పుడు లేదా ముందస్తుగా రక్తస్రావాన్ని నివారించేందుకు ఇస్తారు.
కొత్తగా వచ్చిన ఎక్స్టెండెడ్ హాఫ్ లైఫ్ థెరపీలు ఎక్కువసేపు శరీరంలో పనిచేయడం వల్ల తరచూ ఇంజెక్షన్లు అవసరం లేకుండా చేస్తాయని చెబుతున్నారు. అలాగే నాన్-ఫ్యాక్టర్ థెరపీలు శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. జీన్ థెరపీ కూడా హీమోఫీలియా చికిత్సలో ఆశాజనకంగా మారుతోంది. ఈ విధానంలో శరీరంలో పనిచేసే క్లాటింగ్ ఫ్యాక్టర్ జీన్లను ప్రవేశపెట్టి దీర్ఘకాలిక ఫలితాలు పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇది చికిత్స విధానాన్ని మరింత మార్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. హీమోఫీలియాతో జీవించడం కేవలం మందులతో మాత్రమే పరిమితం కాదు. రోజువారీ జీవనశైలిలో కూడా అనేక జాగ్రత్తలు అవసరం అవుతాయి. క్రీడలు, ప్రయాణాలు, సాధారణ పనుల సమయంలో కూడా గాయాలు కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ఎక్కువ దెబ్బలు తగిలే క్రీడలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. అయితే ఈత, సైక్లింగ్ వంటి తక్కువ ప్రమాదం ఉన్న వ్యాయామాలు కండరాలను బలపరచడంలో, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
తరచూ అంతర్గత రక్తస్రావం జరగడం వల్ల దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు, కదలికల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే ఆకస్మిక రక్తస్రావం భయం, చికిత్సపై ఆధారపడాల్సి రావడం, ఆర్థిక భారం వంటి కారణాలు రోగులు, వారి కుటుంబాలపై మానసిక ఒత్తిడిని కూడా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం కూడా చికిత్సలో పెద్ద సవాలుగా మారుతోంది. అందుకే హీమోఫీలియాపై అవగాహన పెరగడం, త్వరగా నిర్ధారణ కావడం, నిరంతర వైద్య పర్యవేక్షణ చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సరైన చికిత్స, ముందస్తు జాగ్రత్తలు, కుటుంబ సహకారం ఉంటే హీమోఫీలియాతో బాధపడుతున్నవారు కూడా సాధారణ జీవితాన్ని గడపగలరని వైద్య నిపుణులు చెబుతున్నారు.