Cerebral Malaria | దోమ కాటు కారణంగా వచ్చే విష జ్వరాల్లో మలేరియా కూడా ఒకటి. ప్రతి సంవత్సరం ఈ జ్వరానికి అనేక మంది గురవుతూ ఉంటారు. అయితే దోమకాటు వల్ల వచ్చే మలేరియా సాధారణంగా జ్వరం, వణుకు, చెమటలు, అలసట వంటి లక్షణాలతో కనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది మెదడుపై ప్రభావం చూపే అత్యంత ప్రమాదకర స్థితికి చేరుతుంది. అలాంటి తీవ్రమైన పరిస్థితినే సెరిబ్రల్ మలేరియాగా పిలుస్తారు. ఇది సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెరిబ్రల్ మలేరియా అనేది ప్రధానంగా ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ అనే మలేరియా పరాన్నజీవి కారణంగా ఏర్పడే తీవ్రమైన నర సంబంధిత సమస్య. ఈ పరాన్నజీవి సోకిన ఎర్ర రక్తకణాలు మెదడులోని చిన్న రక్తనాళాలకు అంటుకుని రక్తప్రసరణను అడ్డుకుంటాయి. దాంతో మెదడులో వాపు, ఆక్సిజన్ సరఫరా తగ్గడం, మెదడు పనితీరు దెబ్బతినడం జరుగుతుంది. తీవ్రమైన సందర్భాల్లో కోమా పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
సాధారణ మలేరియాతో పోలిస్తే సెరిబ్రల్ మలేరియా చాలా వేగంగా తీవ్రరూపం దాల్చుతుంది. మొదట జ్వరం, తలనొప్పి, వాంతులు, అలసట వంటి లక్షణాలు కనిపించినా, తరువాత గందరగోళం, ప్రవర్తనలో మార్పులు, మాట తడబడటం, ఫిట్స్ రావడం, స్పృహ కోల్పోవడం వంటి నర సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారులు, గర్భిణీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దేశంలో వర్షాకాలం, వర్షాల అనంతరం దోమల పెరుగుదల అధికంగా ఉండటంతో ప్రమాదం మరింత పెరుగుతుంది. సెరిబ్రల్ మలేరియా ప్రమాదకరంగా మారడానికి ప్రధాన కారణం మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడమే. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటంతో పాటు ఇన్ఫ్లమేషన్ కారణంగా తలలో ఒత్తిడి పెరుగుతుంది. చికిత్స ఆలస్యమైతే కొన్ని గంటల్లోనే శాశ్వత మెదడు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. ప్రాణాపాయం నుంచి బయటపడిన వారిలో కూడా జ్ఞాపకశక్తి సమస్యలు, చదువులో ఇబ్బందులు, ప్రవర్తనా మార్పులు వంటి దీర్ఘకాల ప్రభావాలు కనిపిస్తాయి.
వైద్యులు సాధారణంగా రక్తపరీక్షల ద్వారా మలేరియా పరాన్నజీవిని గుర్తిస్తారు. అలాగే రోగి లక్షణాలు, నర సంబంధిత పరీక్షల ఆధారంగా సెరిబ్రల్ మలేరియాను నిర్ధారిస్తారు. కొన్ని సందర్భాల్లో మెదడుపై ప్రభావాన్ని అంచనా వేయడానికి స్కానింగ్ పరీక్షలు కూడా చేస్తారు. ఈ పరిస్థితిని అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వ్యాధిగా పరిగణిస్తారు. ఆసుపత్రిలో శిరామార్గం ద్వారా యాంటీ మలేరియా మందులు అందిస్తారు. అదనంగా ఫిట్స్ నియంత్రించడం, రక్తంలో చక్కెర స్థాయిలు సరిచేయడం, రక్తహీనతకు చికిత్స చేయడం, శ్వాస, మూత్రపిండాల పనితీరును పర్యవేక్షించడం వంటి సహాయక చికిత్సలు కూడా కీలకంగా ఉంటాయి. సెరిబ్రల్ మలేరియాను నివారించడానికి దోమల కాట్ల నుంచి రక్షణ అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళ దోమతెరలు ఉపయోగించడం, దోమల నివారణ క్రీములు వాడడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం, ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మలేరియా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభిస్తే తీవ్రమైన పరిస్థితులను నివారించవచ్చు. అలాగే ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవడం, ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చికిత్స పొందడం వంటివి చేయడం వల్ల ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.