Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం జాగ్రత్తలు పాటించాలి..?
పండుగలు, వేడుకల సమయంలో పెద్ద మొత్తంలో వంటకాలు తయారు చేయడం, వాటిని ఎక్కువసేపు బయట ఉంచడం వల్ల ఆహారం కలుషితమై ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముందురోజే అన్నం, పప్పు వండడం, పనీర్ కూరలను ఎక్కువసేపు బయట ఉంచడం, పాలతో చేసిన స్వీట్లను సరైన విధంగా భద్రపరచకపోవడం, విందుల్లో వండిన పదార్థాలను గంటల తరబడి టేబుళ్లపై ఉంచడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
Food Poisoning | పండుగలు, వేడుకల సమయంలో పెద్ద మొత్తంలో వంటకాలు తయారు చేయడం, వాటిని ఎక్కువసేపు బయట ఉంచడం వల్ల ఆహారం కలుషితమై ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముందురోజే అన్నం, పప్పు వండడం, పనీర్ కూరలను ఎక్కువసేపు బయట ఉంచడం, పాలతో చేసిన స్వీట్లను సరైన విధంగా భద్రపరచకపోవడం, విందుల్లో వండిన పదార్థాలను గంటల తరబడి టేబుళ్లపై ఉంచడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా ఇలాంటి లక్షణాలు ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయి. అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా అదే రోజు వైద్యులను సంప్రదించాలి. ఆహారం తీసుకున్న ఒకటి నుంచి ఆరు గంటల్లోనే వాంతులు, కడుపునొప్పి మొదలైతే ఆహారంలో ముందుగానే ఏర్పడిన విషపదార్థాల వల్ల అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎనిమిది నుంచి 72 గంటల తర్వాత లక్షణాలు కనిపిస్తే సాల్మొనెల్లా, షిగెల్లా, క్యాంపిలోబాక్టర్, ఈ-కోలి వంటి బ్యాక్టీరియాలు కారణమయ్యే అవకాశం ఉంటుంది.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..
మలంలో రక్తం కనిపించడం, నల్లగా తారులా విసర్జన కావడం, విరేచనాలతోపాటు 38.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ జ్వరం రావడం ప్రమాద సంకేతాలు. ఇలాంటి సందర్భాల్లో మల పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవాలి. వైద్యుల సూచన లేకుండా విరేచనాలను అరికట్టే మందులు వాడకూడదు. ఫుడ్ పాయిజనింగ్లో ప్రధాన ప్రమాదం శరీరంలో నీరు, లవణాలు తగ్గిపోవడం. మూత్రం ముదురు రంగులో రావడం, రోజుకు మూడుసార్ల కంటే తక్కువగా మూత్ర విసర్జన జరగడం, నాలుక పొడిబారడం, నిలబడినప్పుడు తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కళ్లు లోపలికి పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్జలీకరణంగా భావించాలి. ఓఆర్ఎస్ను ప్రతి విరేచనం తర్వాత కొద్దికొద్దిగా తాగడం ద్వారా కోల్పోయిన నీరు, లవణాలను భర్తీ చేయవచ్చు. ఆరు గంటల పాటు ఓఆర్ఎస్ కూడా కడుపులో నిలవకుండా వాంతులు అవుతుంటే ఆసుపత్రిలో సెలైన్ ద్వారా ద్రవాలు అందించాల్సి వస్తుంది. పిల్లలు, 65 ఏళ్లు పైబడినవారిలో దాహం గుర్తించే సామర్థ్యం తక్కువగా ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలి.
అత్యవసర వైద్య సహాయం ఎప్పుడు అవసరం అంటే..
కొన్ని అరుదైన లక్షణాలు అత్యవసర వైద్య సహాయం అవసరమని సూచిస్తాయి. కళ్లకు రెండుగా కనిపించడం, కనురెప్పలు వాలిపోవడం, మాట తడబడడం, మింగడంలో ఇబ్బంది, చేతులు కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కలుషిత ఆహారంలోని కొన్ని విషపదార్థాల వల్ల వస్తాయి. నోటి చుట్టూ తిమ్మిరిగా అనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చే కడుపునొప్పి కొంతసేపు వచ్చి తగ్గుతుంది. కానీ నొప్పి నిరంతరంగా ఉండడం, ముఖ్యంగా కుడివైపు కింది పొత్తికడుపులో ఎక్కువ కావడం, పొట్ట గట్టిగా మారడం వంటి లక్షణాలు ఇతర తీవ్రమైన సమస్యలకు సంకేతాలు అవుతాయి. 24 గంటలకు మించి వాంతులు, మూడు రోజులకు మించి విరేచనాలు కొనసాగినా, రెండో రోజు జ్వరం పెరిగినా వైద్య పరీక్షలు అవసరం. రక్తంతో కూడిన విరేచనాల తర్వాత చిన్నారుల్లో మూత్రం తగ్గడం, ముఖం వాపు, పాలిపోయినట్లు కనిపించడం వంటి లక్షణాలు మూత్రపిండాల సమస్యను సూచిస్తాయి. మధుమేహం ఉన్నవారిలో ద్రవాలు తగ్గడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. ఇన్సులిన్ లేదా ఇతర మందులు వాడేవారు వైద్యుల సలహా లేకుండా మోతాదులను మార్చకూడదు. గర్భిణులు, పిల్లలు, మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు స్వల్ప లక్షణాలు కనిపించినా ముందుగానే వైద్యులను సంప్రదించాలి.
ముందు జాగ్రత్తలు తప్పనిసరి..
ఫుడ్ పాయిజనింగ్ను నివారించడంలో ఆహారాన్ని సరైన విధంగా వండడం, నిల్వ చేయడం కీలకం. వండిన ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలి. వంట పూర్తయిన రెండు గంటల్లోపు ఫ్రిజ్లో పెట్టాలి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు గంటలోపే చల్లబరచి భద్రపరచాలి. అన్నాన్ని పలుచని పాత్రల్లో త్వరగా చల్లబరిచి, అవసరమైనప్పుడు ఒక్కసారి మాత్రమే పూర్తిగా వేడిచేసి తినాలి. పాల స్వీట్లు, క్రీమ్తో చేసిన పదార్థాలను తప్పనిసరిగా ఫ్రిజ్లో ఉంచాలి. అపరిచిత దుకాణాల నుంచి స్వీట్లు కొనుగోలు చేసేటప్పుడు వాటి వాసన, రంగు, నాణ్యతను పరిశీలించాలి. ప్రతి వంటకానికి ప్రత్యేకమైన వడ్డించే స్పూన్లను ఉపయోగించడం, ఆహారాన్ని వడ్డించే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గించవచ్చు. పండుగ విందుల ఆనందం అనారోగ్యానికి దారితీయకుండా ఉండాలంటే ఆహార పరిశుభ్రతతోపాటు ప్రమాద సంకేతాలను గుర్తించి సమయానికి వైద్య సహాయం పొందడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం జాగ్రత్తలు పాటించాలి..?
U19 Asia Cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్పై భారత్ సంచలన విజయం!
AP News | అప్పు తీర్చలేదని తల్లిని, 6 నెలల పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు
‘సింగరేణి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు’
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

