Coconut Water | ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది కొబ్బరినీళ్లను సేవిస్తుంటారు. కొబ్బరి నీళ్లను సహజసిద్ధమైన స్పోర్ట్స్ డ్రింక్‌గా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. అయితే కొబ్బరినీళ్లను చాలా మంది కేవలం అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడే తాగుతారు. కానీ వీటిని రోజూ తాగవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోజూ ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లను తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయని అంటున్నారు. కొబ్బరి నీళ్లలో 95 శాతం నీరు ఉంటుంది. కనుక ఈ నీళ్లను సేవిస్తుంటే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. రోజంతా ఎండలో తిరిగే వారు ఉదయమే ఈ నీళ్లను తాగితే ఎంతో మేలు జరుగుతుంది.
కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నిషియం వంటి ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తాయి. వేడి వాతావరణంలో శరీరానికి చల్లదనం లభించేలా చేస్తాయి. దీని వల్ల శరీరంలోని వేడి తగ్గిపోతుంది. శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందవచ్చు. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీపీ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. కొబ్బరి నీటిలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
కొబ్బరినీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కొబ్బరి నీళ్లను సేవించడం వల్ల కిడ్నీల్లో క్యాల్షియం ఆగ్జలేట్ ఆధారిత స్టోన్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరినీళ్లలో క్యాలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. కనుక ఈ నీళ్లను చక్కెర పానీయాలు లేదా సోడాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. దీని వల్ల సహజసిద్ధంగా తీపి తీసుకున్న భావన కలుగుతుంది. పైగా బరువు తగ్గించుకోవడం తేలికవుతుంది.
కొబ్బరినీళ్లు సహజసిద్ధమైన డైయురెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. దీని వల్ల కిడ్నీలు, లివర్ శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా కొబ్బరినీళ్లను తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే ఈ నీళ్లను రోజూ ఉదయం తాగితే మంచిదని వైద్యులు చెబుతున్నారు. రోజూ ఈ నీళ్లను ఒక గ్లాస్ మోతాదులో తాగవచ్చు. లేదా 1 నుంచి 2 కప్పులు తాగవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఈ నీళ్లను రోజూ తాగకూడదు. కొబ్బరినీళ్లను రోజూ ఉదయం పరగడుపునే తాగాలి. లేదా మధ్యాహ్నం భోజనం అనంతరం ఒక గంట విరామం ఇచ్చి అయినా సేవించవచ్చు. ఇలా ఈ నీళ్లను రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.