మనం తినే తిండి మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. మన బతుకు చక్రం ముందుకు కదిలేలా చేస్తుంది. అందుకే, పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు మనం తినే ఆహారం పోషకాలకు బదులుగా ఓ ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. భారతదేశపు ఆహార నమూనాల్లో 50 శాతానికిపైగా పదార్థాల్లో పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో మనం తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇటీవలి కాలంలో మనదేశంలో క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఆరోగ్య నిపుణులు, పర్యావరణవేత్తల్లో ఆందోళన మొదలైంది. వ్యవసాయంలో పరిమితికి మించి పురుగుమందులు, కీటక నాశనులు వాడటం, వాటి హానికరమైన రసాయనాలు ఆహారంపై పేరుకుపోవడానికి కారణమవుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా ైగ్లెఫోసేట్ అనే పురుగుమందు క్యాన్సర్కు దారితీయవచ్చని హెచ్చరించింది.
పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లో సాధారణంగా కనిపించే ఆర్గానోఫాస్ఫేట్స్, కార్బమేట్స్, ైగ్లెఫోసేట్ తదితర రసాయనాల అవశేషాలకు రొమ్ము, ప్రొస్టేట్, పొట్ట మొదలైన క్యాన్సర్లకు లంకె ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) నివేదిక వెల్లడించింది. అంతేకాదు పురుగుమందులు (పెస్టిసైడ్లు) మన శరీరంలో కీలకమైన కణాల పనితీరును దెబ్బతీస్తాయి. డీఎన్ఏ విధ్వంసానికి కూడా
దారి తీస్తాయి.
పంటల దిగుబడి పెరగడానికి ఏండ్ల కొద్దీ రసాయన ఎరువులు, పురుగుమందులను ఉపయోగిస్తున్నాం. కానీ, ఈ రసాయనాల ప్రభావం పొలానికి బయట కూడా ఉంటుంది. ఇవి నేల, నీరు, ఆహారాల్లో చేరిపోతాయి. మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల మన సాగు విధానాన్ని పునః పరిశీలించుకోవాలి.
సహజమైన, రసాయనాలు లేని సాగు విధానాలను ఎంచుకోవడమే దీనికి పరిష్కారం. ఇలా చేస్తే పర్యావరణాన్ని కాపాడుకోవడంతోపాటు మన కుటుంబాలను, భావితరాలను కూడా పరిరక్షించుకుంటాం. వచ్చే ఐదేండ్లలో క్యాన్సర్ కేసులు 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సుస్థిర వ్యవసాయ పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.