Health | కలిసి ఉంటే సుఖంగా ఉంటాం. కలిపి తింటే బలంగా ఉంటాం. ఆహార పదార్థాల్లోని పోషకాల్లో దేనికదే ప్రత్యేకం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిరకాల పోషకాలనూ తీసుకోవాలి. అందుకే కలిపి తినాలని చెబుతారు నిపుణులు.
చిక్కుడు – అన్నం
చిక్కుడుకాయ కూర, అన్నం కలుపుకొని తింటే ఈ రెండిటిలోని పోషకాలను శరీరం తీసుకుంటుంది. అన్నంలో ఉండే అమైనో యాసిడ్లు శరీర కణజాల నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్లను గ్రహించగలవు కూడా.
ఆకుకూరలు-టమాట
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలని మనకు తెలుసు. చాలా రకాల సమస్యలను ఆకుకూరలు నివారిస్తాయనే అవగాహన కూడా ఉంది. పాలకూర, బచ్చలికూర లాంటి ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరలను టమాటాతో కలిపి తినడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది. కారణం, టమాటాలో విటమిన్-సి పుష్కలం. ఇది ఐరన్ సంగ్రహణకు తోడ్పడుతుంది. వండిన ఆకుకూరలు లేదా ఆకుకూరల సలాడ్స్‌పై నిమ్మరసం చల్లుకుని తిన్నా విటమిన్-సి అందుతుంది. దీని సాయంతో ఆకుకూరల్లో ఉన్న ఐరన్‌ను శరీరం తీసుకోగలదు.
గుడ్లు – జున్ను
గ్లాసునిండా పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయని అందరూ నమ్మేదే. పాలు తాగితే ఎముకలు ఎంత పుష్టిగా ఉంటాయో గుడ్లు, జున్ను తిన్నా అంతే శక్తిమంతంగా ఉంటాయి. ఎముకలు తయారు కావాలంటే క్యాల్షియం కావాలి. ఆ క్యాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్-డి ఉండాలి. ఎముకల ఆరోగ్యానికి ఈ రెండూ ముఖ్యమే. గుడ్డు సొనలో విట మిన్-డి పుష్కలంగా ఉంటే.. జున్నులో క్యాల్షియం కావాల్సినంత ఉంటుంది. జున్నుతో ఆమ్లెట్ వేసుకుంటే ఎముకలు
ఉక్కుకంటే బలంగా తయారవుతాయి!
టమాట – ఆలివ్ ఆయిల్
టమాట లేకపోతే చాలా వంటలు అసాధ్యం. టమాట సాస్, సూప్, పేస్ట్‌లలో లైకోపీన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. అంతేకాదు, గుండె జబ్బుల్ని నివారిస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని అరికడుతుంది. టమాట సాస్ లేదా పేస్ట్ తిన్నప్పుడు ఆలివ్ ఆయిల్ కూడా కొంత జోడించుకుంటే లైకోపీన్‌ను శరీరం పూర్తిగా గ్రహిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.