Detoxification | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ కూడా సాఫీగా సాగాలి. సాధారణంగా రాత్రి మనం నిద్రించిన సమయంలో మన శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇది మన శరీరంలో నిరంతరం సాగుతూనే ఉంటుంది. మన శరీరంలో ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు, చర్మం వంటి ఐదు అవయవాలల్లో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. వీటిలో ఏ ఒక్క అవయవంలోనైనా డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరగకపోతే శరీరంలో నొప్పి, వాపు, మంట, బరువు పెరగడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులు శరీరం నుండి కార్బన్ డయాక్సైడ్ ను తొలగించలేనప్పుడు మనం అనారోగ్యానికి గురవుతాం. శరీరంలో వ్యర్థాలు పెరగడంతో పాటు గుండెదడ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
కాలేయం విషపదార్థాలను బయటకు పంపకపోతే దాని పనితీరు మందగిస్తుంది. ఫ్యాటీ లివర్, వాపులు, నొప్పులు, బద్దకం, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే మూత్రపిండాలు వ్యర్థాలను వడకట్టకపోతే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేగులు మలం ద్వారా వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఒకవేళ ప్రేగుల్లో డిటాక్సిఫికేషన్ సరిగ్గా జరగకపోతే గ్యాస్, మలబద్దకం, రోగనిరోధక శక్తి తగ్గడం, మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అదే విధంగా చర్మం వ్యర్థాలను తొలగించకపోతే మొటిమలు, పొడిచర్మం, చికాకు, దురద వంటి సమస్యలు వస్తాయి. ఈ అవయవాలు సరిగ్గా పనిచేసి వ్యర్థాలను బయటకు పంపినప్పుడే శరీర ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. కానీ డిటాక్పిఫికేషన్ ప్రక్రియ సాఫీగా సాగక మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సరిగ్గా సాగాలంటే మనం రెండు పద్దతులను పాటించాలి. ఇవి రెండు కూడా సహజమైనవి, ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. విశ్రాంతి, నిద్ర. ఇవి రెండు కూడా డిటాక్సిఫికేషన్ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. డిటాక్సిఫికేషన్ ప్రక్రియ కోసం విశ్రాంతిని శరీరంతో పాటు పొట్టకు కూడా ఇవ్వాలి. ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారిలో వ్యర్థాలు ఎక్కువగా తయారవుతాయి. వీటిని బయటకు పంపించడం చాలా అవసరం. నిరంతరం తినడం వల్ల జీర్ణవ్యవస్థ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీంతో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ మందగిస్తుంది. కనుక పొట్టకు విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం. పొట్టకు విశ్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉపవాసం. సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు మనం దాదాపు 12 గంటలు జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం వల్ల డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతుంది.
అయితే మనం రోజూ ఉపవాసం చేయాల్సిన అవసరం కూడా లేదు. మన వీలుని బట్టి ఉపవాసం చేయడం వల్ల శరీరం నుండి వ్యర్థాలు తొలగిపోతాయి. జీర్ణాశయానికి విశ్రాంతిని ఇవ్వడం వల్ల మూత్రపిండాలు, కాలేయం, ప్రేగులకు కూ డా విశ్రాంతి లభిస్తుంది. దీంతో శరీరం మొత్తం కూడా డీటాక్సిఫికేషన్ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇక డీటాక్సిఫికేషన్ ప్రక్రియ సాఫీగా సాగడానికి మనం తగినంత నిద్రించడం కూడా చాలా అవసరం. మనం నిద్రిస్తున్న సమయంలోనే మన శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సంభవిస్తుంది. కనుక నిద్రించడానికి చక్కటి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం వల్ల చక్కని నిద్రను సొంతం చేసుకోవచ్చు. అలాగే నిద్రించడానికి గంట ముందు నుండే గాడ్జెట్ లను వాడడం మానేయాలి. ఇలా చేయడం వల్ల నిద్రకు ఆటంకాలు కలగకుండా ఉంటాయి. ఈ విధంగా విశ్రాంతి, నిద్ర మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి ఎంతగానో సహాయపడతాయి.