Taro Root | మార్కెట్లో మనకు అనేక రకాల దుంపలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చామ దుంపలు కూడా ఒకటి. ఇవి జిగురుగా ఉంటాయి. కనుక చాలా మంది వీటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ చామదుంపలతో పులుసు, టమాటా కర్రీ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ కూరలను ఇష్టంగా తింటారు. అయితే వాస్తవానికి చామ దుంపలు ఇతర దుంపల కన్నా భిన్నమైనవి. ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చామ దుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. ఈ దుంపలను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు తరచూ ఈ దుంపలను తింటుంటే ఫలితం ఉంటుంది.
చామ దుంపల్లో రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. కనుక ఈ దుంపలను తింటుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. చామ దుంపలలో ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటాయి. కనుక ఈ దుంపలు ఇతర దుంపల్లాగా షుగర్ లెవల్స్‌ను పెంచవు. ఈ దుంపల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ కూడా తక్కువగా ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా ఈ దుంపలను తినవచ్చు. పైగా ఈ దుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
చామ దుంపల్లో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీని వల్ల రక్త నాళాలు వెడల్పుగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ దుంపలను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఈ దుంపల్లో ఉండే సంక్లిష్టమైన పిండి పదార్థాల కారణంగా వీటిని తింటే శరీరానికి శక్తి నిరంతరం లభిస్తూనే ఉంటుంది. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ దుంపలు మేలు చేస్తాయి. సాధారణంగా దుంపలు అంటే బరువు పెంచుతాయి అని అనుకుంటారు. కానీ చామ దుంపలు మాత్రం బరువును తగ్గిస్తాయి. ఈ దుంపల్లో ఉండే ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇలా బరువు తగ్గడం తేలికవుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు తరచూ చామ దుంపలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. ఇక ఈ దుంపల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో అధికంగా ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. చర్మ కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. దీని వల్ల చర్మంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే ఈ దుంపల్లో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు, రోగాలు రాకుండా ఉండేందుకు సహాయం చేస్తాయి. ఇలా చామ దుంపలను తరచూ తింటుండడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.