Indian Broad Beans | మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే కూరగాయల్లో చిక్కుడు కాయలు కూడా ఒకటి. ఇవి సాధారణంగా మనకు రెండు రకాలుగా లభిస్తాయి. గింజలు, కాయ లావుగా ఉండే చిక్కుడు కాయలు, ఆయా భాగాలు పలుచగా, వెడల్పుగా ఉండే కాయలు.. ఇలా చిక్కుడు కాయలు రెండు రకాలుగా లభిస్తాయి. మొదటి రకానికి చెందిన చిక్కుడు కాయలను అడవి చిక్కుడు అని కూడా పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కాయలు ఎక్కువగా కాస్తాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇక రెండో రకానికి చెందిన చిక్కుళ్లు మనకు అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. అయితే చిక్కుడు కాయలను తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. కానీ ఇవి మనకు అనేక పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. చిక్కుడు కాయలను తరచూ తింటే అనేక లాభాలను పొందవచ్చు. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. రోగాలు రాకుండా చూస్తాయి.
చిక్కుడు కాయలను తరచూ తినడం వల్ల వృక్ష సంబంధ ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. నాన్ వెజ్ తినని వారికి చిక్కుళ్లను చక్కని ప్రత్యామ్నాయ ఆహారంగా చెప్పవచ్చు. వీటిని తింటే ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. దీని వల్ల కండరాలకు మరమ్మత్తులు జరుగుతాయి. కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శారీరక శ్రమ, వ్యాయామం చేసే వారికి చిక్కుళ్లు ఎంతో దోహదం చేస్తాయి. వీటి వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. చక్కని దేహ ధారుఢ్యం సొంతమవుతుంది. ఇవి శరీరానికి ఎంతో శక్తిని అందించి ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. వీటిని తినడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇక వీటిని తినడం వల్ల ప్రోటీన్లు, ఫైబర్‌ను సమృద్ధిగా పొందవచ్చు. అందువల్ల ఈ కాయలను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయం చేస్తుంది.
చిక్కుళ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి ఉండదు. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. చిక్కుళ్లు ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. అందువల్ల వీటిని తింటుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. చిక్కుళ్లలో అధికంగా ఉండే ఐరన్ వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తం తక్కువగా ఉన్నవారు తరచూ చిక్కుళ్లను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. అలాగే వీటిని తింటే ఫోలేట్ సైతం సమృద్ధిగా లభిస్తుంది. ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. గర్భస్థ శిశువు ఆరోగ్యానికి, ఎదుగుదలకు సహాయం చేస్తుంది. శిశువుకు పుట్టుక లోపాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
చిక్కుళ్లలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందిస్తాయి. మనం తిన్న ఆహారం నుంచి శక్తి శరీరానికి అందేందుకు దోహదం చేస్తాయి. చిక్కుళ్లను తినడం వల్ల వాటిల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. చిక్కుళ్లలో ఉండే పొటాషియం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. చిక్కుళ్లో మాంగనీస్, కాపర్ సైతం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి, సాంద్రత పెరిగేందుకు దోహదం చేస్తాయి. దీని వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా చిక్కుడు కాయలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక ఇకపై చిక్కుళ్లు కనిపిస్తే విడిచిపెట్టకుండా తెచ్చుకుని తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.