Goat Head Curry | ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు చికెన్ తింటే కొందరు మటన్ లేదా చేపలు, రొయ్యలు తింటారు. అయితే మటన్ తినే చాలా మందికి ఇష్టమైన వంటల్లో తలకాయ కూర కూడా ఒకటి. సరిగ్గా వండాలే కానీ తలకాయ కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో లభించే తలకాయ కూర అంటే చాలా మంది లొట్టలేసుకుంటూ తింటారు. అయితే కూరను తినడం వరకు బాగానే ఉంటుంది. కానీ దీంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అన్న వివరాలు చాలా మందికి తెలియవు. అయితే పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం మేక తలకాయ కూరను తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. అలాగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 100 గ్రాముల తలకాయ కూరను తింటే సుమారుగా 200 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 30 గ్రాములు, కొవ్వులు 20 గ్రాములు లభిస్తాయి.
తలకాయ కూరలో అనేక విటమిన్లు, మినరల్స్ సైతం ఉంటాయి. విటమిన్లు బి12, బి2, బి3, బి6, సి, ఎ, ఇ, కె లతోపాటు జింక్, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, పొటాషియం, మెగ్నిషియం, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల తలకాయ కూరను తింటే పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. శరీరానికి పోషణ లభిస్తుంది. ఈ కూరను తినడం వల్ల ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రోటీన్ల వల్ల కండరాల నిర్మాణం జరుగుతుంది. కండరాలకు మరమ్మత్తులు నిర్వహించబడతాయి. దీంతో కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. శక్తి లభిస్తుంది. ఎక్కువ సేపు పని చేయగలుగుతారు. నీరసం, అలసట అనేవి రావు.
మేక తలకాయ కూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తం తక్కువగా ఉన్నవారు తరచూ తలకాయ కూరను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇందులో జింక్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. ఈ కూరలో ఉండే ఫాస్ఫరస్, క్యాల్షియం ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి. ఈ కూరను తింటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ కూరలో ఉండే సెలీనియం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని తింటే థైరాయిడ పనితీరు మెరుగు పడుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తలకాయ కూరను తరచూ తింటే మేలు జరుగుతుంది.
తలకాయ కూరలో కాపర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది మన శరీరానికి శక్తి లభించేలా చేస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. తలకాయ కూరలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. చాలా మందికి విటమిన్ బి12 లోపం వస్తుంది. అలాంటి వారు ఈ కూరను తింటే విటమిన్ బి12 లోపం నుంచి బయట పడవచ్చు. విటమిన్ బి12 వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మెడ, వెన్ను, భుజాల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. తలకాయ కూరను తింటే మోకాళ్లు, కీళ్లలో పోయిన గుజ్జు తిరిగి వస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఇలా తలకాయ కూరను తరచూ తింటే అనేక లాభాలను పొందవచ్చు.