Giloy Juice | మన చుట్టూ పరిసరాల్లో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే ఆయుర్వేద మొక్కలు చాలానే ఉంటాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లోనే పెరుగుతుంది. దీన్ని చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ మొక్క తిప్పతీగ అని, ఇది ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని, ఇందులో ఔషధ గుణాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. తిప్పతీగకు చెందిన ఆకుల రసాన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఆకుల రసాన్ని సేవిస్తే అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. తిప్పతీగ ఆకుల రసాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. ఒకసారికి 1 లేదా 2 టీస్పూన్ల మోతాదులో ఈ రసాన్ని సేవించాల్సి ఉంటుంది. తిప్పతీగ రసాన్ని రోజూ సేవిస్తుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
తిప్పతీగ ఆకుల రసంలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల దీన్ని తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తిప్పతీగ ఆకుల రసాన్ని సేవిస్తుంటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లేలా చేస్తాయి. శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. తిప్పతీగ ఆకుల రసంలో యాంటీ పైరెటిక్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని సేవిస్తుంటే జ్వరం తగ్గుతుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే జీర్ణశక్తి మెరుగు పడుతుంది. వివిధ రకాల జ్వరాలను తగ్గించే శక్తి ఈ రసానికి ఉంటుంది. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి జ్వరాల నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే ప్లేట్లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. డెంగీ వచ్చిన వారికి ఈ రసం ఎంతగానో మేలు చేస్తుంది.
తిప్పతీగను ఆయుర్వేద భాషలో మధునాశినిగా పిలుస్తారు. అంటే షుగర్‌ను తగ్గిస్తుందన్నమాట. తిప్పతీగ రసాన్ని తాగితే శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తిప్పతీగ రసాన్ని సేవిస్తుంటే మేలు జరుగుతుంది. అలాగే ఈ రసాన్ని సేవించడం వల్ల డయాబెటిస్ కారణంగా వచ్చే ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. షుగర్ ఉన్నవారికి తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. తిప్పతీగ రసాన్ని సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో అజీర్తి, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. విరేచనాలను తగ్గించే శక్తి కూడా తిప్పతీగకు ఉంటుంది.
తిప్పతీగలో బయో యాక్టివ్ సమ్మేళనాలు అనేకం ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల ఆర్థరైటిస్, గౌట్ వంటి వ్యాధుల కారణంగా వచ్చే వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్లు మరింత మృదువుగా కదులుతాయి. అరిగిపోయిన గుజ్జు మళ్లీ ఉత్పత్తి అవుతుంది. కీళ్లు ఆరోగ్యంగా మారుతాయి. తిప్పతీగ రసాన్ని సేవిస్తుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇది సహజసిద్ధమైన అడాప్టొజెనిక్గా పనిచేస్తుంది. దీని రసాన్ని సేవిస్తుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. తిప్పతీగ ఆకుల రసాన్ని సేవిస్తుంటే లివర్ క్లీన్ అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ డిటాక్స్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇలా తిప్పతీగ రసాన్ని రోజూ సేవిస్తుండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.