Barley Water | ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది రకరకాల పానీయాలను తాగుతుంటారు. అయితే కొన్ని రకాల పానీయాలు మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలను అధికంగా అందిస్తాయి. కానీ అలాంటి వాటి గురించి చాలా మందికి తెలియదు. వాటిల్లో బార్లీ నీళ్లు కూడా ఒకటి. బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి ఈ నీళ్లను తయారు చేస్తారు. ఈ నీళ్లను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. బార్లీ గింజల్లో అనేక పోషకాలు, ఔషధ విలువలు ఉంటాయి. ఇవి పలు వ్యాధులను నయం చేస్తాయి. గుప్పెడు బార్లీ గింజలను తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే అందులో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగేయాలి. ఇలా చేస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు. బార్లీ గింజల్లో బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా అడ్డుకుంటుంది. కనుక షుగర్ ఉన్నవారు ఈ నీళ్లను తాగితే మేలు జరుగుతుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే తేనె కలపకుండా నీళ్లను తాగాలి.
బార్లీ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకునేలా చేస్తుంది. దీంతో అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. బార్లీ గింజల్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. కనుక ఈ గింజలతో నీళ్లను తయారు చేసి తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటారు. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అతిగా ఆహారం తింటున్నవారు బార్లీ నీళ్లను రోజూ తాగుతుంటే ఫలితం ఉంటుంది.
బార్లీ గింజల్లో ఉండే బీటా గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. బార్లీ నీటిలో అద్భుతమైన డిటాక్సిఫయింగ్ గుణాలు ఉంటాయి. ఈ నీళ్లు క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తాయి. ఈ నీళ్లను తాగితే శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు పోతాయి. బార్లీ నీళ్లు సహజసిద్ధమైన డైయురెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. కనుక శరీరంలో ఉండే వ్యర్థాలతోపాటు ఎక్కువగా ఉన్న నీరు కూడా బయటకు పోతుంది. దీంతో బరువు తగ్గుతారు. అలాగే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. బార్లీ గింజల నీళ్లను రోజూ తాగుతుంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
బార్లీ గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా అనేక రకాల బి విటమిన్లతోపాటు ఐరన్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు మెటబాలిజం మెరుగు పడేలా చేస్తాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బార్లీ నీళ్లు సహజసిద్ధమైన రిఫ్రెషింగ్ డ్రింక్‌లా కూడా పనిచేస్తాయి. ఈ నీళ్లను తయారు చేసిన తరువాత కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి తాగితే శరీరానికి చల్లదనం లభిస్తుంది. వ్యాయామం, శారీరక శ్రమ చేసిన తరువాత ఇలా తాగితే వెంటనే శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. శరీరం కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందుతుంది. బార్లీ గింజలను మరిగించే ముందు నీటితో శుభ్రంగా కడగాలి. అర కప్పు గింజలకు 4 లేదా 5 కప్పుల నీళ్లను పోయాలి. స్టవ్‌ను సిమ్‌లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి. దీంతో నీళ్లు రెడీ అవుతాయి. ఈ నీళ్లను వడకట్టిన తరువాత గోరు వెచ్చగా ఉండగానే రుచి కోసం తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.