Watermelon Seeds | పుచ్చకాయను కోసిన తర్వాత గింజలు పారేయకండి. వాటిలో అపారమైన పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. పుచ్చ గింజల్లోని మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచిది. రోగ నిరోధక వ్యవస్థనూ మెరుగు పరుస్తుంది. రక్తపోటు నివారణకు ఉపయోగపడే ‘సిట్రులేన్’ పుచ్చ గింజల్లో ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్‌ను పారదోలే లక్షణమూ దీనికి ఉంది. పురుషుల్లో సంతానోత్పత్తికి అవసరమైన జింక్ కూడా లభిస్తుంది.
పుచ్చకాయ గింజల నుంచి తీసిన సారాన్ని మధుమేహం ఉన్న ఎలుకల మీద ప్రయోగించి చూసినప్పుడు మంచి ఫలితాలు కనిపించాయి. ఊబకాయాన్ని పోగొట్టే గుణాన్నీ గుర్తించారు. ఈ గింజల్లోని మాంగనీసు, క్యాల్షియం ఆర్థరైటిస్ నివారణలో మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. పుచ్చ గింజలలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ గింజలకు చర్మానికి నిగారింపునిచ్చే గుణమూ ఉంది. పుచ్చ గింజల నుంచి తీసిన నూనె చుండ్రును నివారిస్తుంది. శిరోజాలకు శక్తినిస్తుంది.