Veg Vs Non Veg | మనలో చాలా మంది జంతు సంబంధిత మాంసాహారాన్ని, మొక్కల ఆధారిత శాకాహారాన్ని కలిపి తీసుకుంటారు. మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ అందాలంటే వీటిని కలిపి తీసుకోవడం చాలా అవసరం. అప్పుడే మనకు పోషకాహార లోపం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే మాంసాహారాలు, శాకాహారాలు రెండూ మన ఆరోగ్యానికి అవసరమైనవే అయినప్పటికీ వీటిలో దేనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు కలుగుతుందనే సందేహాలు మనకు వస్తూనే ఉంటాయి. మాంసాహారాల్లో ప్రోటీన్స్ తో పాటు పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే వీటిలో శరీరానికి హానిని కలిగించే కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి మాంసాహారులు తీసుకునే ఆహారంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇక శాకాహార ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. శాకాహార ఆహారాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే విషయంలో ఈ రెండు రకాల ఆహారాలను సమర్థించే వారు కూడా ఉన్నారు. అయితే మాంసాహారం, శాకాహారాల్లో ఏది శ్రేష్ఠమైనది, దేనిని తీసుకోవడం వల్ల మనం ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు అన్న వివరాలను పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
మాంసాహార ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో ఉండే ఆమైనో ఆమ్లాలు కండరాల అభివృద్దికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శరీర మరమ్మత్తుకు సహాయపడతాయి. జంతు సంబంధిత ఉత్పత్తులల్లో ఐరన్, జింక్, విటమిన్ బి12, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీవక్రియల వేగం పెంచడంలో సహాయపడతాయి. మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. అయితే శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు మాంసాహార ఆహారాల్లో కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వృక్ష సంబంధిత పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారాల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా శాకాహార ఆహారాల్లో సంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. కనుక మాంసాహారం కంటే శాకాహారమే శ్రేష్ఠమైనదని వైద్యులు చెబుతున్నారు.
అయితే శాకాహార ఆహారాల్లో విటమిన్ బి12, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు వంటి పోషకాలు ఎక్కువగా లభించవు. కనుక మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. జీవన శైలిని బట్టి, శారీరక శ్రమ, శరీర అవసరాలకు అనుగుణంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారం ఏదైనా అది మనకు మేలు చేసేలా ఉండేలా సూచిస్తున్నారు. నాన్ వెజ్ లేదా వెజ్ ఏది తినాలని ఆలోచించేవారు ఏదో ఒక ఆహారాన్ని ఎంచుకుని తినడం ఉత్తమమని అంటున్నారు. కానీ అన్ని పోషకాలు లభించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.