Antibiotics | జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకోవడం చాలామందిలో సాధారణంగా మారింది. కొన్ని రోజులుగా లక్షణాలు తగ్గకపోయినా లేదా జ్వరం కొనసాగుతున్నా.. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చనే అనుమానంతో యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. అయితే ప్రతి ఇన్ఫెక్షన్కు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. ముఖ్యంగా వైరస్ల వల్ల వచ్చే అనారోగ్యాల్లో వీటి వాడకం ప్రయోజనం ఇవ్వకపోగా, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జలుబు, ఇన్ఫ్లుయెంజా, తీవ్రమైన బ్రాంకైటిస్ వంటి సాధారణ అనారోగ్యాల్లో ఎక్కువగా వైరస్‌లే కారణమవుతాయి. యాంటీబయాటిక్స్ మాత్రం బ్యాక్టీరియాపై మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి జ్వరం, దగ్గు లేదా గొంతునొప్పి వంటి లక్షణాలు ఉన్నంత మాత్రాన అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అని నిర్ధారించలేమని, సరైన కారణాన్ని గుర్తించిన తర్వాతే తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమని వారు చెబుతున్నారు.
అవసరం లేకుండా ప్రతి సారి యాంటీబయాటిక్ కోర్సు తీసుకోవడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్య పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే యాంటీబయాటిక్ ఉపయోగించినప్పుడు దానికి సున్నితంగా ఉండే బ్యాక్టీరియా నశిస్తాయి. కానీ నిరోధకత కలిగిన బ్యాక్టీరియా మాత్రం బతికి, మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సమాచారం ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా సాధారణ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ప్రయోగశాలలో నిర్ధారించిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లలో ప్రతి ఆరింటిలో ఒకటి యాంటీబయాటిక్ చికిత్సకు నిరోధకత చూపించిందని తేలింది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కేవలం ఆసుపత్రులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. అవసరం లేని సందర్భాల్లో యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా కూడా ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. భవిష్యత్తులో సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కూడా మందులు సమర్థవంతంగా పనిచేయని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల వ్యక్తిగతంగా కూడా కొన్ని దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వికారం, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు, ఇతర మందులతో ప్రతికూల పరస్పర చర్యలు, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థకు సహాయపడే గట్ మైక్రోబయోమ్ అని పిలిచే శరీరంలోని సూక్ష్మజీవుల సమతుల్యత కూడా దెబ్బతింటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. గట్ మైక్రోబయోమ్‌లో మార్పులు ఏర్పడటం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా క్లోస్ట్రిడియాయిడిస్ డిఫిసైల్ వంటి బ్యాక్టీరియా కారణంగా తీవ్రమైన విరేచనాలు, పెద్దప్రేగులో వాపు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
ముక్కు నుంచి వచ్చే కఫం పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారితే అది తప్పనిసరిగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కు సంకేతమని చాలామంది భావిస్తారు. అయితే ఇది సరైన అభిప్రాయం కాదని అనారోగ్య సమయంలో శరీరంలో సహజంగా జరిగే రోగనిరోధక ప్రతిస్పందనలో భాగంగానే నాసికా స్రావం రంగు మారుతుందని, అలాగే జలుబు తగ్గిపోయిన తర్వాత కూడా కొంతకాలం దగ్గు కొనసాగడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిందని అనుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే యాంటీబయాటిక్స్‌ను పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు. బ్యాక్టీరియా వ్యాధి ఉన్నట్లు అనుమానం లేదా నిర్ధారణ ఉన్నప్పుడు అవి అవసరమైన చికిత్సగా మారుతాయి. బ్యాక్టీరియల్ న్యూమోనియా, స్ట్రెప్టోకోకల్ గొంతు ఇన్ఫెక్షన్, కొన్ని మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కొన్ని సంక్లిష్టమైన చర్మ ఇన్ఫెక్షన్లలో యాంటీబయాటిక్స్ అవసరం అవుతాయి. అందువల్ల యాంటీబయాటిక్స్‌కు పూర్తిగా దూరంగా ఉండటం కాదు.. అవసరమైనప్పుడు మాత్రమే సరైన మందును ఉపయోగించడం ముఖ్యం. చికిత్సలో సరైన నిర్ధారణకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందని నిర్ధారించడానికి తగిన ఆధారాలు ఉన్నాయా, కనిపిస్తున్న లక్షణాలకు మరేదైనా కారణం ఉండవచ్చా, న్యూమోనియా, సెప్సిస్ లేదా ఇతర తీవ్రమైన సమస్యలకు సంబంధించిన సూచనలు ఉన్నాయా అనే విషయాలను వైద్యులు పరిశీలించాలి. అవసరమైన సందర్భాల్లో మైక్రోబయాలజీ పరీక్షలు, యాంటీమైక్రోబయల్ ససెప్టిబిలిటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా ఇన్ఫెక్షన్కు కారణమైన సూక్ష్మజీవిని గుర్తించి, దానికి సమర్థవంతంగా పనిచేసే మందును ఎంపిక చేసుకోవచ్చు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు కూడా కచ్చితమైన క్లినికల్ నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, అవసరమైన సందర్భాల్లో మాత్రమే అనుభవాధారిత యాంటీబయాటిక్ చికిత్సను పరిమితం చేయాలని సూచిస్తున్నాయి.
యాంటీబయాటిక్స్ వినియోగంలో రోగుల పాత్ర కూడా కీలకమే. గతంలో వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్‌ను సొంతంగా తిరిగి వాడకూడదు. ఇతరులు ఉపయోగిస్తున్న మందులను కూడా తీసుకోకూడదు. లక్షణాలు తగ్గాయి లేదా పెరిగాయి అనే కారణంతో వైద్యుల సూచన లేకుండా చికిత్సను ప్రారంభించడం, ఆపడం చేయకూడదు. యాంటీబయాటిక్స్ అవసరం లేదని వైద్యులు సూచించినప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం, లక్షణాలను తగ్గించే చికిత్స తీసుకోవడం, ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉండటం వంటి చర్యలు ఉపశమనానికి సహాయపడతాయి. యాంటీమైక్రోబయల్ స్టీవార్డ్‌షిప్ అంటే రోగులకు చికిత్స నిరాకరించడం కాదు. సరైన వ్యాధికి సరైన మందును, సరైన మోతాదులో, సరైన వ్యవధిలో ఉపయోగించడమే దీని ప్రధాన ఉద్దేశం. యాంటీబయాటిక్ నిరోధకత పెరుగుతున్న సమయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్‌ను జాగ్రత్తగా ఉపయోగించడం భవిష్యత్తులో వాటి ప్రభావాన్ని కొనసాగించడానికి ఎంతో అవసరం. జలుబు వంటి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల కోలుకునే సమయం వేగవంతం కాదు. పైగా అనవసరమైన దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పాటు, భవిష్యత్తులో సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కూడా మందులు సరిగా పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే యాంటీ బయాటిక్ లను తీసుకునే ముందు ఈ మందు నిజంగా అవసరమా? అనే ప్రశ్న వేసుకోవడం చాలా ముఖ్యం. ఈ జాగ్రత్త ప్రస్తుత ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, భవిష్యత్తులో కూడా ప్రాణాలను రక్షించే యాంటీ బయాటిక్స్ ప్రభావవంతంగా ఉండేలా సహాయపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.