Rock Salt | రోజూ మనం తయారు చేసే వంటల్లో లేదా కూరల్లో కచ్చితంగా ఉప్పు ఉండాల్సిందే. ఉప్పు లేకుండా ఏ వంటకమూ పూర్తి కాదు. ఉప్పు వంటకాలకు రుచిని అందిస్తుంది. అయితే ఉప్పును రోజూ మోతాదుకు మించి మాత్రమే తినాలి. అధికంగా తింటే అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. కిడ్నీలపై భారం పడుతుంది. రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో హైబీపీ వస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కనుక ఉప్పును మోతాదులోనే తినాల్సి ఉంటుంది. అయితే సాధారణ ఉప్పుకు బదులుగా మీరు వంటల్లో రాక్ సాల్ట్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకోండి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాదు, మన శరీరానికి కావల్సిన పలు మినరల్స్ కూడా లభిస్తాయి. రాక్ సాల్ట్‌నే హిమాలయన్ సాల్ట్ అని, సైంధవ లవణం అని భిన్న రకాలుగా పిలుస్తారు. దీన్ని రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి.
తెలుపు రంగు ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. కానీ రాక్ సాల్ట్‌లో అనేక మినరల్స్ ఉంటాయి. పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం, ఐరన్ ఉంటాయి. ఇవి మన శరీరంలో అనేక జీవక్రియలు సక్రమంగా నిర్వర్తించబడేందుకు దోహదం చేస్తాయి. సాధారణ ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్‌ను తింటే ఆరోగ్యంపై ఎలాంటి దుష్ర్పభావం పడదు. రోగాలు రాకుండా నివారించవచ్చు. ఆయుర్వేద చెబుతున్న ప్రకారం రాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. రాక్ సాల్ట్‌ను తీసుకోవడం వల్ల జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. పొట్టలో హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీంతో మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి ఉండదు. కడుపు ఉబ్బరం, గ్యాస్ నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
రాక్ సాల్ట్‌లో పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ అధికంగా ఉన్న కారణంగా ఇవి ఎలక్ట్రోలైట్స్ మాదిరిగా పనిచేస్తాయి. శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచుతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తాయి. చెమట అధికంగా ఉత్పత్తి అవకుండా ఉంటుంది. శరీరం చెమట వాసన రాకుండా చూసుకోవచ్చు. కండరాల నొప్పులు తగ్గిపోతాయి. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా రాక్ సాల్ట్ మేలు చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో రాక్ సాల్ట్‌ను కలిపి ఆ నీళ్లను గొంతులో పోసి పుక్కిలిస్తుంటే గొంతులో గరగర, మంట, నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు తగ్గిపోతాయి. శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గాలి సరిగ్గా లభిస్తుంది. అలర్జీల నుంచి సైతం బయట పడవచ్చు.
రాక్ సాల్ట్‌లో మినరల్స్ అధికంగా ఉన్న కారణంగా దీన్ని నీటితో కలిపి పేస్ట్‌లా చేసి చర్మానికి నేరుగా అప్లై చేయవచ్చు. దీంతో చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. స్నానం చేసే నీటిలోనూ రాక్ సాల్ట్‌ను కలిపి స్నానం చేయవచ్చు. దీంతోనూ చర్మంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రాక్ సాల్ట్‌లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మొటిమలను, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. కనుక రాక్ సాల్ట్‌ను తరచూ ఉపయోగించవచ్చు. అయితే ప్రాసెస్ చేయబడిన రాక్ సాల్ట్‌లో మినరల్స్ తక్కువగా ఉంటాయి. కనుక సహజసిద్ధమైన రాక్ సాల్ట్ వాడితే మంచిది. సాధారణ తెల్ల ఉప్పు, రాక్ సాల్ట్‌లలో సోడియం అధికంగానే ఉంటుంది. కనుక రాక్ సాల్ట్‌ను అయినా సరే తక్కువగానే ఉపయోగించాలి. కాకపోతే ఇతర మినరల్స్ తెలుపు రంగు ఉప్పులో కన్నా రాక్ సాల్ట్‌లో ఎక్కువగా ఉంటాయి కనుక మన ఆరోగ్యానికి తెల్ల ఉప్పు కన్నా రాక్ సాల్ట్ ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి రోజువారి ఆహారంలో రాక్ సాల్ట్‌ను వాడాల్సి ఉంటుంది.