Red Hibiscus Flowers | చాలా మంది తమ ఇళ్లలో మందార చెట్లను పెంచుతుంటారు. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. ఎక్కువగా ఎరుపు రంగు మందార చెట్లను పెంచుతారు. ఇవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించడమే కాదు, మన జుట్టుకు కూడా ఎన్నో లాభాలను అందిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఎరుపు రంగు మందార పువ్వులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ పువ్వుల్లో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారేలా చేస్తాయి. అలాగే చుండ్రును కూడా సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఎరుపు రంగు మందార పువ్వులను పలు విధాలుగా ఉపయోగించడం వల్ల జుట్టుకు ఎంతగానో మేలు జరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
మందార పువ్వులతో తయారు చేసే ఓ నూనెను వాడితే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ పువ్వుల్లో ఉండే అమైనో ఆమ్లాలు, కెరాటిన్ జుట్టును దృఢంగా మారుస్తాయి. వెంట్రుకలు చిట్లిపోకుండా రక్షిస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. 5 నుంచి 6 తాజా మందార పువ్వులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని మెత్తని పేస్ట్‌లా చేయాలి. 1 కప్పు కొబ్బరినూనెను తీసుకుని సన్నని మంటపై కాస్త వేడి చేయాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మందార పువ్వుల పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మళ్లీ వేడి చేయాలి. స్టవ్‌ను సిమ్‌లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు వేడి చేస్తే నూనె నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారుతుంది. తరువాత స్టవ్‌ను ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి. ఆ నూనెను బాగా పిండి వడకట్టాలి. అనంతరం వచ్చే నూనెను ఓ సీసాలో నిల్వ చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు బాగా తగిలేలా మర్దనా చేయాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. లేదా రాత్రి పూట రాసి రాత్రంతా అలాగే ఉంచవచ్చు. తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఎరుపు రంగు మందార పువ్వులను తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్‌లా మార్చి అందులో కొద్దిగా పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఈ చిట్కాలను వారంలో 2 సార్లు పాటిస్తుంటే శిరోజాలకు తేమ లభిస్తుంది. శిరోజాలు పొడిబారిపోవడం తగ్గిపోతుంది. వెంట్రుకలు చిట్లిపోకుండా దృఢంగా ఉంటాయి. శిరోజాలు కాంతివంతంగా కూడా కనిపిస్తాయి. 2 టేబుల్ స్పూన్ల మందార పువ్వుల గుజ్జులో అంతే మోతాదులో కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదళ్లకు తగిలేలా బాగా పట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. ఈ చిట్కాను పాటిస్తుంటే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు తగ్గుతుంది. శిరోజాలు కుదుళ్ల నుంచి దృఢంగా మారుతాయి.
మందార పువ్వులను నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చాలి. అనంతరం వడకట్టాలి. ఈ నీళ్లను తలకు రాయాలి. కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే తలలో ఉండే దురద పోతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు. శిరోజాలు కాంతివంతంగా కనిపిస్తాయి. అలాగే కొద్దిగా ఉసిరిక పొడిని తీసుకుని అందులో మందార పువ్వుల పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా జుట్టుకు పట్టించాలి. 60 నిమిషాలు అయ్యాక తలస్నానం చేయాలి. తరచూ ఈ చిట్కాను పాటిస్తుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. తెల్లగా ఉన్న జుట్టు సహజసిద్ధంగా నల్లగా మారుతుంది. ఉసిరిక పొడిలో ఉండే విటమిన్ సి శిరోజాలకు పోషణను అందిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఎరుపు రంగు మందార పువ్వులతో పలు చిట్కాలను పాటిస్తుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి. చుండ్రు తగ్గిపోతుంది. శిరోజాలు కాంతివంతంగా కూడా కనిపిస్తాయి.