Black Salt | బ్లాక్ సాల్ట్.. దీన్నే హిందీలో కాలా నమక్ అంటారు. దక్షిణ ఆసియాకు చెందిన చాలా మంది బ్లాక్ సాల్ట్‌ను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చాట్స్, సలాడ్స్, ఇతర శాకాహార వంటకాల్లో బ్లాక్ సాల్ట్‌ను ఎక్కువగా వాడుతారు. అయితే ఆయుర్వేద ప్రకారం బ్లాక్ సాల్ట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది పలు రకాల వ్యాధులకు మెడిసిన్‌లా పనిచేస్తుంది. మీరు రోజూ వాడే సాధారణ తెల్ల ఉప్పుకు బదులుగా బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. బ్లాక్ సాల్ట్‌ను వాడడం వల్ల జీర్ణాశయంలో జఠరాగ్ని పెరుగుతుంది. ఇది ఆల్కలైన్ గుణాలను కలిగి ఉంటుంది. బ్లాక్ సాల్ట్‌లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. కనుక పొట్టలో ఏర్పడే అసిడిటీని తగ్గిస్తాయి. లివర్‌లో పైత్య రసం సరిగ్గా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తాయి.
బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, సలాడ్స్ వంటి వాటిలో కలిపి బ్లాక్ సాల్ట్‌ను చాలా సులభంగా తీసుకోవచ్చు. ఈ ఉప్పులో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఉప్పును ఆహారంలో భాగం చేసుకుంటే పేగుల్లో మలం సులభంగా కదులుతుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్లాక్ సాల్ట్‌లో సోడియం క్లోరైడ్ ఉంటుంది. కానీ సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది. అందువల్ల సాధారణ ఉప్పు కన్నా బ్లాక్ సాల్ట్ మనకు మేలు చేస్తుందని చెప్పవచ్చు. శరీరంలో సోడియం పరిమాణం పెరిగితే కిడ్నీలపై భారం పడుతుంది. దీంతో శరీరం వాపులకు గురవుతుంది. ఈ సమస్యలు రావొద్దంటే బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
హైబీపీ ఉన్నవారిని ఉప్పు అధికంగా తినొద్దని చెబుతుంటారు. అయితే అలాంటి వారు సాధారణ ఉప్పుకు బదులుగా బ్లాక్ సాల్ట్‌ను వాడవచ్చు. ఇందులో సోడియం పరిమాణం తక్కువ కనుక బీపీ పేషెంట్లకు మేలు చేస్తుంది. అయితే ఉప్పు ఏదైనా ఉప్పే కనుక బ్లాక్ సాల్ట్‌ను కూడా హైబీపీ ఉన్నవారు తక్కువ మోతాదులోనే తినాలి. కానీ ఆరోగ్యకరమైనది కనుక బీపీ పేషెంట్లు తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వాడితే మేలు జరుగుతుంది. బ్లాక్ సాల్ట్‌లో ఐరన్, క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి మినరల్స్ ఎన్నో లభిస్తాయి. సాధారణ ఉప్పులో ఇవి ఉండవు. కనుక పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి బ్లాక్ సాల్ట్ ఎంతగానో మేలు చేస్తుంది. బ్లాక్ సాల్ట్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుకనే ఈ ఉప్పు ఆ రంగులో ఉంటుంది. బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. నాడులు, కండరాల పనితీరు మెరుగు పడుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎర్రరక్త కణాలు వృద్ధి చెందుతాయి.
బ్లాక్ సాల్ట్‌లో ఉండే పొటాషియం కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉండేలా చేస్తుంది. దీని వల్ల కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. బ్లాక్ సాల్ట్‌లో ఉండే అనేక మినరల్స్ కారణంగా ఈ ఉప్పు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే దురదలు, దద్దుర్లు, వాపులు తగ్గిపోతాయి. ఈ ఉప్పును ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసి కూడా వాడవచ్చు. దీంతో చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా తయారవుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. కేశాలకు కూడా బ్లాక్ సాల్ట్ మేలు చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రు నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. ఇలా బ్లాక్ సాల్ట్‌ను రోజూ వాడితే మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.