Asafoetida | దేశంలో అనేక రాష్ట్రాలకు చెందిన వారు ఇంగువను తమ వంటల్లో వేస్తుంటారు. ఇంగువను వేయడం వల్ల కూరలకు చక్కని వాసన, రుచి వస్తాయి. ముఖ్యంగా పులిహోర, చారు వంటివి చేసినప్పుడు కచ్చితంగా ఇంగువను వేస్తారు. అయితే ఆయుర్వేద ప్రకారం ఇంగువ అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇంగువతో పలు వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు. వంటల్లో ఇంగువను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఇంగువలో పలు ముఖ్యమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన లాభాలను అందిస్తాయి.
ఇంగువను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు ఇంగువను ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ఇంగులో ఉండే కార్మినేటివ్ గుణాలు జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతాయి. గ్యాస్‌ను బయటకు వెళ్లేలా చేస్తాయి. ఇంగువ యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అజీర్తి కారణంగా వచ్చే నొప్పితోపాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, ఐబీఎస్ వంటి సమస్యల కారణంగా వచ్చే పొట్ట నొప్పి నుంచి కూడా ఇంగువ ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంగువను ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇంగువ శ్వాకోస వ్యవస్థను సైతం ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని సహాయంతో దగ్గు, జలుబును తగ్గించుకోవచ్చు. ముక్కు దిబ్బడ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారు కూడా కూరల్లో ఇంగువను వాడుతుంటే ఉపశమనం లభిస్తుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా ఆడుతుంది. ఆస్తమా నుంచి బయట పడవచ్చు. ఇంగువలో ఫినోలిక్ సమ్మేళనాలు, బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఇంగువను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది.
ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫినోలిక్ సమ్మేళనాలతోపాటు టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించేందుకు సహాయం చేస్తాయి. కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా రక్షిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఇంగువను ఆహారంలో భాగం చేసుకుంటే బీపీ తగ్గుతుందని తేలింది. ఇంగువలో కౌమరిన్స్ అని పిలవబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ తగ్గుతుంది. అలాగే రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడకుండా ఉంటాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఇలా ఇంగువతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కనుక దీన్ని వంటల్లో కచ్చితంగా ఉపయోగించాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.