ఎన్నో వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు నెలవు.. అపరిశుభ్రమైన టాయిలెట్లు. ముఖ్యంగా, పాశ్చాత్య తరహా టాయిలెట్ సీటు, ఫ్లషింగ్ బటన్, నీటి స్ప్రే, తలుపుల పిడులు (డోర్నాబ్స్), కమోడ్ తదితర ప్రాంతాల్లో ఎన్నోరకాల హానికర క్రిములు తిష్ఠవేసి ఉంటాయి. ఇవి చర్మానికి అంటుకున్నప్పుడు.. కలుషితమైన చేతుల ద్వారా నోరు, ముక్కు, కండ్లలోకి ప్రవేశించి అనారోగ్యాలకు కారణం అవుతాయి. చిన్నచిన్న రోగాలు మొదలు ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్ర రుగ్మతలు కూడా టాయిలెట్ నుంచే ప్రబలుతాయి. స్ట్రెప్టోకోకస్, ఈ-కొలి, సాల్మొనెల్లా, కాంపిలోబ్యాక్టర్, షిజెల్లా లాంటి బ్యాక్టీరియా, హెపటైటిస్, ఎబోలా తదితర వైరస్లకు మరుగుదొడ్లు ఆవాసాలు.
వీటివల్ల గొంతునొప్పికి సంబంధించిన స్ట్రెప్థ్రోట్, కలరా, డయేరియా లాంటి అతిసార వ్యాధులు, లైంగిక అంటువ్యాధి అయిన గనేరియా, గజ్జి లాంటి చర్మ ఇన్ఫెక్షన్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్, జలుబు, ఫ్లూ, న్యుమోనియా, స్కార్లెట్ ఫీవర్, కడుపులో తీవ్రమైన నొప్పులు, ఎబోలా, హెపటైటిస్ లాంటి ఆరోగ్య
సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, మలమూత్ర విసర్జన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకుండానే ఉపయోగించిన.. సెల్ఫోన్లు, పరికరాల మీద కూడా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ తిష్ఠవేస్తాయి. అలా ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. కాబట్టి టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా ఎన్నో రోగాలను ఆమడ దూరంలో ఉంచవచ్చు.