కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం, ఒమిక్రాన్ అంతగా ప్రభావం చూపకపోవడంతో మనం ఊపిరితీసుకున్నాం. అయితే, మరో కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో మళ్లీ ఇదేంట్రా దేవుడా! అని తలలు బాదుకుంటున్నాం. అయితే, మనకు ఇంకా ఆ కొత్త వేరియంట్ ముప్పు రాకపోవడం ఉపశమనం కలిగిస్తున్నది. ఈ కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో బ్రిటన్ వాసులు కంటి మీద కునుకు కరువవుతున్నారు.
బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వెలుగు చూడటం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ వేరియంట్ పేరు డెల్టాక్రాన్. ఇది డెల్టా, ఓమిక్రాన్లతో రూపొందించబడిన హైబ్రిడ్ జాతి. దీనిని సైప్రస్ పరిశోధకులు గత నెలలో తొలిసారి గుర్తించారు. అయితే, ల్యాబ్‌లో సాంకేతిక తప్పిదం జరిగిందని శాస్త్రవేత్తలు భావించారు. ఇప్పుడు ఇదే వేరియంట్‌కు సంబంధించిన కేసులు బ్రిటన్‌లో నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ వ్యాప్తిపై బ్రిటన్‌కు చెందిన యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ దృష్టి సారించింది. ఇప్పటికే వెలుగు చూసిన డేల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను ‘వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.
జనవరి నెలలో డెల్టాక్రాన్ కేసులను సైప్రస్‌కు చెందిన బయోటెక్నాలజీ, మాలిక్యులార్ వైరాలజీ ల్యాబ్ అధిపతి లియోండియోస్ కోస్ట్రికస్ బృందం గుర్తించింది. ఆ సమయంలో సైప్రస్‌లో 25 డెల్టాక్రాన్ కేసులు ఉన్నాయని, 25 మందిలో 11 మంది కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత దవాఖానలో చేరారని కోస్ట్రికస్ వెల్లడించారు. మిగిలిన 14 మందికి ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు.
అయితే, అప్పట్లో లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన వైరాలజిస్ట్ టామ్ పీకాక్ డెల్టాక్రాన్.. ఇది కొత్త వేరియంట్ కాదని, ‘ల్యాబ్‌లో సాంకేతిక తప్పిదం’ అని కొట్టిపారేశారు. దాంతో జనవరి నెలలో డేల్టాక్రాన్ను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఎక్కువ శాతం మంది వ్యాక్సిన్లు, బూస్లర్ మోతాదులు తీసుకున్నందున డేల్టాక్రాన్ వేరియంట్‌కు భయపడాల్సిన పనిలేదని బ్రిటన్‌కు చెందిన డాక్టర్ పాల్ హంటర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాక్సిన్లతో బ్రిటన్‌వాసుల్లో డేల్టా, ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందినందున కొత్త వేరియంట్ గురించి ఆందోళన అనవసరమని ఆయన చెప్పారు.