మూడు రకాల పండ్లతో చేసే త్రిఫలా చూర్ణం గొప్ప ఆయుర్వేద ఔషధం. ఇది పొట్టకు సంబంధించిన సమస్యల నివారణలో దోహదపడుతుంది.మలబద్ధకం, పొట్టలో ఆమ్లం వంటివాటికి త్రిఫలను దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు ఈ చూర్ణాన్ని తీసుకుంటే పొట్టకు సంబంధించిన ఎన్నో వ్యాధులకు పరిష్కారం లభిస్తుంది.
ఇక త్రిఫల పొట్టకు మాత్రమే కాదు కండ్లు, వెంట్రుకలు, చర్మ ఆరోగ్యానికీ మంచిదే. ఈ పొడిలో ఎక్కువ వరకు ఉసిరికాయ పొడి ఉంటుంది. కేశాలు, చర్మకణాల మరమ్మతుకు ఉసిరిలో ఉండే విటమిన్ సి ఉపకరిస్తుంది. త్రిఫల తీసుకోవడం వల్ల కురులు బలంగా అవుతాయి. చర్మం కాంతిమంతంగా మారుతుంది. ఆయుర్వేద వైద్యుల ప్రకారం ఇది కండ్లకూ మేలుచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ లాంటి తీవ్రమైన రోగాలను కూడా నివారించగలవు. త్రిఫలను రోజూ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఎలా చేస్తారు?
ఆయుర్వేద విలువలు కలిగిన మూడు రకాల పండ్ల నుంచి తయారుచేస్తారు కాబట్టి, దీనికి త్రిఫలా చూర్ణం అనే పేరువచ్చింది. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలే ఆ మూడు రకాలైన పండ్లు. త్రిఫలా చూర్ణంలో ఒక వంతు కరక్కాయ, రెండు వంతుల తానికాయ, మూడు వంతుల ఉసిరికాయ గింజల మిశ్రమం ఉంటుంది. కరక్కాయలో పిత్తాశయాన్ని బ్యాలెన్స్ చేసే లక్షణాలు ఉంటాయి. తానికాయలో యాంటీ మైక్రోబియల్, యాంటీ అలర్జిక్ గుణాలు పుష్కలం. ఆయుర్వేదం ప్రకారం తానికాయ దగ్గు, జలుబులను తగ్గిస్తుంది. కాగా ఉసిరికాయ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు భాండాగారం. ఉసిరి మన కండ్లు, జుట్టు, చర్మం ఆరోగ్యానికి గొప్ప వరం. త్రిఫలా చూర్ణం పొడిరూపంలో, మాత్రలుగా దొరుకుతుంది. కానీ, ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకే దీన్ని తీసుకోవాలి.