ట్రై జమైనల్ న్యూరాల్జియా.. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. కేవలం ముఖ భాగాన్ని మాత్రమే ప్రభావితంచేస్తుంది. ఎందుకంటే మెదడు నుంచి ముఖంలోనికొన్ని భాగాలకు అనుసంధానమై ఉన్న ట్రైజమైనల్ నరాలుదెబ్బతినడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందంటున్నారు వైద్యనిపుణులు. దీని వల్ల ముఖంలోని కొన్ని భాగాలలో హఠాత్తుగా షాక్ తగిలినట్లు భరించలేని నొప్పి వస్తుంది. ఈ నొప్పి కారణంగా రోగి తీవ్ర ఇబ్బందికి గురవుతాడు. అంతే కాకుండా కొంత మంది రోగులు ఈ నొప్పిని తట్టుకోలేక ఆత్మహత్యకు కూడా పాల్పడతారు. అందుకే ఈ వ్యాధిని ‘సూసైడల్ డిసీజ్’ అని కూడా అంటారు.
ట్రై జమైనల్ న్యూరాల్జియా సమస్యను సకాలంలో గుర్తించి, సరైన చికిత్స అందిస్తే ఉపశమనం పొందవచ్చంటున్నారు వైద్యనిపుణులు. అసలు ఈ ట్రై జమైనల్ న్యూరాల్జియా అంటే ఏంటి…ఈ వ్యాధి రావడానికి గల కారణాలేంటి, దీని లక్షణాలు, అందుబాటులో ఉన్న వైద్య చికిత్సలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
మెదడు నుంచి ముఖానికి అనుసంధానమై ఉండే ఒక నరాన్ని ‘ట్రైజమైనల్ నర్వ్’ అంటారు. ముఖంలోని కుడి, ఎడమ భాగాలకు ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ నరం మెదడు నుంచి ముఖం ప్రాంతానికి వచ్చిన తరువాత మూడు భాగాలుగా విడిపోతుంది. అందుకే దీనిని ట్రై జమైనల్ నర్వ్ అంటారు. ఈ నరాలు ముఖ భాగాలకు స్పర్శను తెలియచేస్తాయి. విడిపోయిన దాంట్లో మొదటి నరాన్ని వి1 అని, రెండో నరాన్ని వి2 అని, మూడో నరాన్ని వి3గా పిలుస్తారు. మొదటి నరమైన వి1 కన్నులోని నల్లగుడ్డుకు, నుదుటి భాగానికి అనుసంధానమై ఉంటుంది. వి2 ముక్కు పక్క భాగానికి, చెంప, పై పెదవికి అనుసంధానమై ఉంటుంది. వి3 నరం అనేది కింద పెదవి, దవడకు సంబంధం కలిగి ఉంటుంది.
మెదడులో నుంచి వెళ్లే ట్రై జమైనల్ నరం పక్క నుంచి ఒక రక్తనాళం ఉంటుంది. సాధారణంగా ఈ రక్తనాళానికి, ట్రై జమైనల్ నరానికి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ గ్యాప్ తొలగిపోయి, రక్తనాళం వచ్చి ఈ ట్రై జమైనల్ నరంపై పడుతుంది. సాధారణంగా రక్తనాళంలో రక్తం బొట్టు బొట్టుగా కొంత ప్రెషర్‌తో ప్రవహిస్తుంది. ఈ క్రమంలో రక్తనాళంలో జరిగే రక్తప్రసరణ పోటు, ఒత్తిడితో ట్రైజమైనల్ నరంపై షాక్ తగిలినట్లు అవుతుంది. దీంతో ఆ నరం కనెక్ట్ అయిన భాగంలో షాక్ తగిలినట్లుగా అయ్యి, తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ బాధని భరించలేని కొందరు రోగులు ఆత్మహత్యకు కూడా యత్నిస్తారు. అందుకే దీనిని ‘సూసైడల్ డిసీజ్’ అనికూడా అంటారు. అయితే రక్తనాళం ఈ ట్రై జమైనల్ న్యూరాల్జియా నర్వ్‌పై పడటానికి గల ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవు.
ఈ వ్యాధికి మూడు రకాల చికిత్సా పద్ధతులు ఉంటాయి. ముందుగా మాత్రలు ఇస్తారు. ఇవి షాక్‌ను కొంత నియంత్రిస్తాయి. ఆ తరువాత అందుబాటులో ఉన్న మూడు పద్ధతుల్లో చికిత్స అందించవచ్చు. అందులో మొదటి పద్ధతి బ్రెయిన్ సర్జరీ. రెండో పద్ధతి గామానైఫ్. మూడో పద్ధతి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్.
బ్రెయిన్ సర్జరీ: ఈ పద్ధతిలో మెదడుకు శస్త్ర చికిత్స చేస్తారు. రక్తనాళాన్ని, నరాన్ని వేరు చేసి, వాటి మధ్యలో ప్యాచ్ పెడతారు. దీంతో సమస్య తీరిపోతుంది. కానీ బ్రెయిన్ సర్జరీ అంటే కొంత రిస్క్‌తో కూడినదిగా చెప్పవచ్చు. ఈ సర్జరీ తరువాత రోగి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది.
గామానైఫ్: ఈ పద్ధతిలో రేడియేషన్‌తో చికిత్స చేస్తారు. రేడియేషన్ వల్ల కొంత దుష్ప్రభావం ఉండే అవకాశం ఉండవచ్చు.
రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ పద్ధతి: ఈ విధానంలో ఇంజెక్షన్ ద్వారా చికిత్స అందిస్తారు. ఈ ప్రక్రియ కేవలం అరగంటలో పూర్తవుతుంది. ఇందులో ముందుగా ప్రత్యేక వైద్యపరికరాలతో ప్రభావిత నరాన్ని గుర్తిస్తారు. అనంతరం ఇంజెక్షన్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ప్రభావిత నరంపైకి పంపుతారు. దీని వల్ల నరం నుంచి మెదడుకు అందే సిగ్నల్స్ ఆగిపోతాయి. దీంతో షాక్ గాని నొప్పిగాని తగ్గిపోతుంది. ఈ పద్ధతి ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. సక్సెస్ రేటు కూడా 95 శాతం ఉంటుంది. ఈ తరహాలో చికిత్సని అరగంటలో పూర్తి చేసిన తరువాత, రోగిని మూడు నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తారు.
– మహేశ్వర్‌రావు బండారి డాక్టర్ సుధీర్ దార ఎంబీబీఎస్, ఎండీ ఎఫ్ఐఏపీ
ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీ జెనరేటివ్ సెంటర్ జూబ్లీహిల్స్, హైదరాబాద్