World plant milk day | పొద్దున్నే చిన్న పిల్లలకు పాలు తాగిపిస్తుంటాం. పెద్దలకు పాలతో కాఫీ, టీ చేసి ఇస్తుంటాం. జ్వరం వచ్చిందంటే పాలతో బ్రెడ్ తినిపిస్తుంటాం. ఏ మిఠాయి చేసినా పాలను వినియోగిస్తుంటాం. ఇలా పాలతో మనకు ఎంతో అనుబంధం ఉన్నది. ఉదయం నుంచి రాత్రి వరకు పాలను ఏదో ఒక రూపంలో వాడుతుంటాం. అయితే, పాడిపశువుల సంఖ్య నానాటికి తగ్గిపోతుండటంతో పాలు దొరకడం ఇబ్బందిగా పరిణమించింది. మన అవసరాన్ని ఆసరాగా చేసుకుని పాల అమ్మకందారులు పాలను కల్తీ చేసి విక్రయిస్తూ మనకు అనారోగ్యం అంటగడుతున్నారు. ఫలితంగా చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు కల్తీ పాలు, నకిలీ పాలతో అనేక వ్యాధులకు గురవుతున్నారు.
పాడి పశువుల పాలకు ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారిత పాలపై దృష్టి పెట్టాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. జంతు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రపంచ మొక్కల ఆధారిత పాల దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 22 న జరుపుకుంటున్నాం. గేదె పాలల్లో విటమిన్ డీ, కాల్షియం వంటివి ఉండి మన ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటంలో సహాయపడతాయి. అయితే, కల్తీ లేని, నకిలీ కాని పాలు దొరకడం ప్రస్తుత రోజుల్లో అసంభవంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో గేదె పాలకు ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారిత పాలను వినియోగించేలా ప్రజల్ని ప్రేరేపించాల్సిన అవసరం ఉన్నది.
బాదం పాలు, సోయా పాలు, జీడిపప్పు పాలు, బియ్యం పాలు, జనపనార పాలు, అవిసె పాలు, చియా గింజల పాలు, నువ్వుల పాలు, గసగసాల పాలు.. ఈ రోజుల్లో సూపర్ మార్కెట్లలో దొరికే కొన్ని మొక్కల ఆధారిత పాల రకాలు. వీటిని గేదె పాలకు ప్రత్యామ్నాయంగా ఎంచుకుని నిత్యం తీసుకోవడం వల్ల పశువుల సంఖ్యను పెంచడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చంటున్నారు వైద్య నిపుణులు.
శాఖాహారులకు అత్యుత్తమ మిల్క్, ప్రోటీన్స్ ఖజానా సోయా విత్తనాల నుంచి తీసిన పాలు. గేదె పాలతో పోలిస్తే క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రోటీన్లు మాత్రం మెండుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, విటమిన్ కే, థయామిన్, ఫోలేల్ వంటి విటమిన్లు, మాలిబ్డినం, కాపర్, ఫాస్పరస్, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు కూడా లభిస్తాయి. సోయా పాలల్లో ఉండే ఐసోఫీవన్స్. రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల నుంచి మనల్ని కాపాడుతుంది. మార్కెట్లో చక్కెర కలిపిన సోయా పాలు లభిస్తున్నాయి. అయితే, చక్కెర కలపని సోయా పాలు తీసుకోవడం శ్రేయస్కరం.
చియా గింజలను పవర్ హౌస్‌లుగా పిలుస్తారు. వీటిల్లో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ చియా గింజల్లో శరీరం యొక్క కాల్షియం డిమాండ్ 13 శాతంను తీర్చగలదంటే ఎంతగా ఉపయోగపడతాయో అర్థం చేసుకోవచ్చు. 45 గ్రాముల చియా గింజల్లో 300 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఈ గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, ఫైబర్ తదితర పోషకాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం. చియా సీడ్స్ మనకు పవర్ బూస్టర్‌గా పనిచేస్తాయి.
జీడిపప్పు పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డీ విటమిన్ లోపంతో బాధపడుతున్న వారు జీడిపప్పు పాలను నిత్యం తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు. ఈ పాలు క్రీమీయర్గా ఉంటున్నప్పటికీ.. తాగడానికి కూడా ఎంతో రుచికరమైనది. జీడిపప్పు పాలను తీసుకోవడం వల్ల ఎనిమియా సమస్య నుంచి బయటపడొచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొదించుకోవచ్చు. చర్మం మెరుపుదలతోపాటు కంటి ఆరోగ్యానికి మంచిది.
బాదం మనకు కావాల్సిన కాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాల్లో ఒకటి. ఒక రోజులో 22 బాదం గింజలను తీసుకోవడం వల్ల రోజంతా కాల్షియం డిమాండ్‌ను తీర్చవచ్చు. అలాగే, అదనపు ఫైబర్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. వీటి పాలను తీసుకోవడం వల్ల దీర్ఘకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. బాదం పప్పులో మెగ్నీషియం, విటమిన్ ఈ ఎక్కువగా ఉండి.. జీవక్రియ సమస్యలను ఎదుర్కోవటానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. నిత్యం ఉదయాన్నే కొన్ని బాదం గింజలను తప్పనిసరిగా తీసుకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.
నల్లని, తెల్లని నువ్వులు.. ఈ రెండింటిలోనూ క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు దాదాపు 30 గ్రాములు తీసుకుంటే 300 మిల్లీగ్రాముల క్యాల్షియం శరీరానికి అందుతుందని నిపుణులు తేల్చారు. అంటే ఒక గ్లాసు పాలతో సమానం. క్యాల్షియంతో పాటు వీటిలో ఫైబర్, కాపర్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. నువ్వుల పాలను తీసుకోవడం వల్ల మధుమేహం, ఆర్థ్రైటిస్ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో నువ్వుల పాలు కీలక పాత్ర పోషిస్తాయి.
గసగసాలు ఒకప్పుడు ప్రతీ ఇంట్లో ఉండేవి. అయితే, వీటి ధర ఆకాశానికి అంటుతుండటంతో వీటిని కొని వాడేందుకు సామాన్య ప్రజానీకం జంకుతున్నారు. ఒక టేబుల్ స్పూన్ గసగసాల పాలు 20 గ్రాములు తీసుకుంటే ఒక గ్లాసు గేదె పాలు తాగిన లెక్క. అంటే 300 మిల్లీ గ్రాముల క్యాల్షియం శరీరానికి అందినట్లే. గసగసాల పాలల్లో క్యాల్షియంతో పాటు మాంగనీస్, ప్రొటీన్లు, కాపర్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
మంచి కొవ్వుల పోషణను కోరుకునే వారికి కొబ్బరి పాలు మంచి ఎంపిక. కొబ్బరి పాలలో ఆవు లేదా గేదె పాల కంటే తక్కువ క్యాలరీలు లభిస్తాయి. పైగా ఇవి మనల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చూస్తాయి. మంచి కొవ్వులతో కూడిన పాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే.. కొబ్బరి పాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ నానబెట్టి మూడు కప్పుల నీరు కలిపి బ్లెండ్ చేయాలి. అనంతరం క్లాత్ సాయంతో వడగట్టి ఆ పాలను వాడుకోవచ్చు. దీనికి తేనె యాడ్ చేయడం ద్వారా మరింత రుచిని పొందవచ్చు. శాకాహారులు కాకుండా.. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు కూడా ఓట్స్ మిల్క్ తాగొచ్చు. ఓట్స్ పాలలో ఉండే బీటా-గ్లూకాన్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. గుండె జబ్బులతో బాధపడుతున్నవారు ఓట్స్ మిల్క్ నిత్యం తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.