సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం, వ్యాయామంలాగా రాత్రి నిద్ర కూడా చాలా ముఖ్యం. జీవనశైలిలో మార్పులు, వివిధ రకాల ఒత్తిడిల వల్ల చాలామందికి సమయానుకూల నిద్ర దూరమైపోయింది. ఇప్పుడు ప్రతి పది మందిలో ఒకరు ఇన్సోమ్నియా (దీర్ఘకాలిక నిద్రలేమి)తో బాధపడుతున్నారు. ఇదికాస్తా మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తున్నది.
నిద్రలేమికి అత్యంత సాధారణ కారణం ఒత్తిడి, ఆందోళన అని పలు అధ్యయనాల్లో తేలింది. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల్లో ఒత్తిడివల్ల మనస్సు 24 గంటలు చురుగ్గానే ఉంటున్నది. దీంతో నిద్ర కష్టతరమవుతోంది. దగ్గరి వ్యక్తుల మరణం లేదా అనారోగ్యం, విడాకులు, ఉద్యోగం కోల్పోవడంలాంటి ఒత్తిడితో కూడిన జీవిత సంఘటనలు కూడా నిద్రలేమికి కారణమవుతోంది.
సరైన విధానం, సానుకూల మనస్సుతో హాయిగా నిద్రపోవచ్చు. ఇన్సోమ్నియా దీర్ఘకాలిక నిద్రలేమిగా మారకముందే ప్రశాంతమైన మనస్సుతో కంటినిండా నిద్రపోవచ్చని వైద్యులు నమ్ముతున్నారు. వైద్యపరంగా నిరూపితమైన కొన్ని సూచనలను వారు అందజేశారు.
1. వ్యాయామం
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. శరీరానికి చెమటపట్టేలా వర్కౌట్స్ చేయాలి. కానీ, నిద్రపోయే సమయానికి కనీసం రెండు నుంచి మూడు గంటల ముందే వ్యాయామాన్ని ముగించాలి. ఎందుకంటే శక్తివంతమైన శరీరం నిద్రపోయేందుకు కొంత సమయం తీసుకుంటుంది.
2. లైట్స్ ఆఫ్ చేయండి..
రాత్రిపూట బెడ్రూం చీకటిగా ఉండాలి. లైట్ కళ్లపై పడితే నిద్ర పట్టదు. బెడ్రూంలో మందపాటి కర్టెన్లు వాడాలి. నిద్రలేమి రోగులు స్లీప్ మాస్కులు వాడాలని వైద్యులు సూచిస్తుంటారు. రాత్రిపూట టీవీ లేదా మొబైల్ స్క్రీన్ చూడడం మానుకోవాలని. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మెదడుపై ప్రభావాన్ని చూపుతాయి. దీంతో నిద్ర కష్టతరమవుతుంది.
3. మనస్సును రిలాక్స్ చేసుకోండి..
రోజంతా కష్టపడుతుంటాం. అది శారీరక శ్రమైనా లేదా మానసిక శ్రమైనా చివర్లో విశ్రాంతి తీసుకోవాలి. ఇందుకోసం ధ్యానం చేయాలి. ఇష్టమైన పాటలు వినడం లేదా బుక్స్ చదవడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. ఆ వెంటనే నిద్రపడుతుంది.
4. కెఫిన్, నికోటిన్ వినియోగాన్ని పరిమితం చేయాలి
కాఫీ, టీ, సిగరెట్లు నిద్రకు అత్యంత శత్రువులు, నిద్రలేమితో బాధపడుతున్నవారు వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి. కాఫీ, టీలకు బదులుగా విశ్రాంతి లేదా ప్రశాంతత కోసం చమోమిలే లేదా గ్రీన్ టీని తీసుకోవాలి.