Hair fall @ Winter | చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటితోపాటు జుట్టు రాలడం అనే సమస్య కూడా వేధిస్తుంటుంది. చలికాలంలో జుట్టు రాలిపోవడానికి కారణమేంటని ఆశ్చర్యపోక తప్పదు. ఈ సీజన్లో చర్మం మాదిరిగానే జట్టులో కూడా చాలా మార్పులు వస్తుంటాయి. చలికాలంలో బయట పొడి గాలి కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. గాలి వాతావరణం స్కాల్ప్ నుంచి తేమ మొత్తాన్ని పీల్చుకుని పొడిగా మారుస్తుంది. చుండ్రు, దురద సమస్యలు కూడా వస్తుంటాయి. చలికాలంలో జుట్టు రాలకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే..
ఆయిల్ మసాజ్
ఇంతకుముందే చెప్పినట్లుగా చలికాలంలో బయటి వాతావరణం పొడి గాలితో నిండి ఉండి స్కాల్ప్ నుంచి సహజ నూనె, తేమను తొలగిస్తుంది. దీన్ని ఎదుర్కొనేందుకు నూనెతో తలకు, జుట్టుకు బాగా మసాజ్ చేయాలి. ఆయిల్ మసాజ్‌లు స్కాల్ప్‌కి రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి. జుట్టు కుదుళ్లను లోపలి నుంచి బలోపేతం చేస్తాయి. జుట్టుకు సరిపోయే కొబ్బరి, బాదాం, ఆలివ్ నూనెలను ఎంచుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సూల్స్ గోరువెచ్చటి నూనెలో వేసి బాగా కలిపి తల నుంచి జట్టు మొదళ్ల వరకు బాగా దట్టించడం ద్వారా వెంట్రుకలు రాలకుండా చూసుకోవచ్చు.
ఈట్ హెల్దీ..
మనం తినే పేలవమైన ఆహారం మన చర్మంపైనే కాకుండా జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది జుట్టు విరిగిపోవడానికి, రాలడానికి దారితీస్తుంది. అందువల్ల, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుతో కూడిన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు కోసం ఆహారంలో సీజనల్‌గా దొరికే పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం మరిచిపోవద్దు.
స్టే హైడ్రెటెడ్..
చలి, పొడి గాలులతో కూడిన సీజన్లో కూడా వేసవిలో మాదిరిగా తగినంత నీరు త్రాగాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉండాల్సిన మేజిక్ కషాయం నీరు. జుట్టును కూడా హైడ్రేట్‌గా ఉంచడానికి తగినంత నీరు త్రాగాలి. నీరు ఎక్కువగా తాగడం అనేది జుట్టు చివర్లు చిట్లిపోకుండా, పెళుసుగా మారకుండా నివారిస్తుంది.
హీటింగ్ టూల్స్ దూరం పెట్టాలి..
జుట్టును స్ట్రెయిటెనింగ్ చేయడం, కర్లింగ్ చేయడం వల్ల వల్ల జుట్టు పొడిగా మారి పాడైపోతుంది. చలికాలంలో పొడిబారడంతో పాటు హీటింగ్ టూల్స్ జుట్టును మరింత బలహీనంగా తయారయ్యేలా చేస్తాయి. అందువల్ల చలికాలంలో హీటింగ్ టూల్స్ పక్కన పెట్టడం చాలా ఉత్తమం. జుట్టును చక్కని స్కార్ఫ్ లేదా హెయిర్ బ్యాండ్‌తో స్టైల్‌గా మలుచుకోవచ్చు.