Sitting Jobs | నేటి జీవనశైలిలో ఎక్కువసేపు కుర్చీలో కూర్చునే అలవాటు దాదాపు ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. అయితే ఎలా కూర్చుంటున్నామనే విషయాన్ని చాలామంది పట్టించుకోరు. కానీ తప్పు భంగిమలో గంటల తరబడి కూర్చోవడం వల్ల మోకాళ్లు, నడుం, తుంటి కీళ్లు, వెన్నెముకపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది కాలక్రమేణా కీళ్ల అరుగుదల, నొప్పులు, కదలికల్లో ఇబ్బందులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన భంగిమతో కూర్చోవడం, అవసరమైన సహాయక పరికరాలను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యలను చాలావరకు నివారించవచ్చని సూచిస్తున్నారు. చాలామంది కాళ్లు మడిచి కూర్చోవడం లేదా నేలపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తారు. అయితే ఇది అపోహ మాత్రమే. ఇలాంటి భంగిమలు మోకాళ్లు, తుంటి కీళ్లపై అధిక ఒత్తిడి కలిగించి, కాలక్రమేణా కీళ్ల అరుగుదలకు కారణమవుతాయి. ముఖ్యంగా గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కీళ్ల కదలిక తగ్గి, నొప్పులు పెరిగే అవకాశం ఉంటుంది.
కూర్చునే సమయంలో ఉపయోగించే కుర్చీ కూడా ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు. నడుముకు సరైన మద్దతు ఇచ్చే ఎర్గోనామిక్ కుర్చీలు వెన్నెముక సహజ వంపును కాపాడటంలో సహాయపడతాయి. ఎత్తు సర్దుబాటు, చేతులకు మద్దతు, మెత్తని సీటు వంటి సౌకర్యాలు ఉన్న కుర్చీలు శరీరాన్ని సరైన స్థితిలో ఉంచి కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎక్కువసేపు కూర్చోవాల్సిన పరిస్థితుల్లో మెమరీ ఫోమ్ లేదా జెల్ సీట్ కుషన్లు ఉపయోగించడం మంచిది. ఇవి శరీర బరువును సమానంగా పంచి మోకాళ్లు, నడుం, తుంటి భాగాలపై పడే ఒత్తిడిని తగ్గించడంతోపాటు కూర్చోవడాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. ఇప్పటికే ఉపయోగిస్తున్న కుర్చీలో లంబార్ సపోర్ట్ పిల్లోలను అమర్చినా మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి వెన్నెముక సహజ వంపుకు మద్దతు ఇచ్చి నడుం, తుంటి భాగాలపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీని వల్ల ఎక్కువసేపు కూర్చున్నా వెన్నునొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
పాదాలు నేలపై సరిగ్గా ఆనించకుండా ఉంటే ఫుట్‌రెస్ట్ ఉపయోగించడం మంచిది. దీని వల్ల పాదాలు స్థిరంగా ఉండి మోకాళ్లు, తుంటి సరైన కోణంలో ఉంటాయి. దీంతో కీళ్లపై అనవసర ఒత్తిడి తగ్గి రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. రోజంతా కూర్చునే ఉద్యోగాలు చేసే వారికి సిట్-స్టాండ్ డెస్క్‌లు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి అవసరానికి అనుగుణంగా కూర్చోవడం, నిలబడడం మధ్య మారేందుకు అవకాశం కల్పిస్తాయి. తరచూ భంగిమ మార్చడం వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గడంతోపాటు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కుర్చీ ఎత్తు కూడా సరైనదిగా ఉండాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు మోకాళ్లు సుమారు 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే రెండు పాదాలు పూర్తిగా నేలపై ఆనివుండాలి. ఈ భంగిమ మోకాళ్లపై ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలం వాటి ఆరోగ్యాన్ని కాపాడటానికి దోహదపడుతుంది. భంగిమను సరిచేసేందుకు ప్రస్తుతం మార్కెట్లో లభించే పోస్టర్ కరెక్టర్లు కూడా ఉపయోగపడతాయి. ఇవి కూర్చునేటప్పుడు లేదా నిలబడినప్పుడు శరీరాన్ని సరైన స్థితిలో ఉంచి కీళ్లపై అనవసర ఒత్తిడిని తగ్గిస్తాయి.
బ్యాలెన్స్ బాల్ కుర్చీలు కూడా మరో మంచి ప్రత్యామ్నాయం. వీటిపై కూర్చోవడం వల్ల శరీరం సమతుల్యతను కాపాడేందుకు కోర్ కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి. దీంతో శరీర భంగిమ మెరుగుపడటంతోపాటు కీళ్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇప్పటికే మోకాళ్ల సమస్యలు ఉన్నవారు తేలికపాటి నీ బ్రేస్‌లు లేదా మోకాళ్లకు మద్దతు ఇచ్చే సపోర్ట్‌లను ఉపయోగించవచ్చు. ఇవి కదలికలకు ఆటంకం కలిగించకుండా మోకాళ్లకు స్థిరత్వాన్ని అందిస్తాయి. అదేవిధంగా రెసిస్టెన్స్ బ్యాండ్లు, యోగా మ్యాట్లు, యోగా బ్లాక్‌లతో చేసే సున్నితమైన స్ట్రెచింగ్, కండరాలను బలపరిచే వ్యాయామాలు కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే నిలబడే సమయంలో లేదా నడిచేటప్పుడు పాదాలకు సరైన మద్దతు ఇచ్చే నాణ్యమైన పాదరక్షలు ధరించడం కూడా మోకాళ్లు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ కూర్చునే విధానంపై కొద్దిపాటి శ్రద్ధ చూపడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక కీళ్ల సమస్యలను నివారించవచ్చు. సరైన భంగిమ, తగిన సహాయక పరికరాలు, తరచూ భంగిమ మార్చుకునే అలవాటు, తేలికపాటి వ్యాయామం వంటి చిన్న మార్పులు దీర్ఘకాలంలో కీళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.