న్యూఢిల్లీ : అద్భుత ఫ్లేవర్, అమోఘమైన రుచితో కూడిన లెమన్‌గ్రాస్ టీ మనల్ని చురుగ్గా ఉంచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడంతో లెమన్‌గ్రాస్ టీ ఉపయోగపడుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. తరచూ ఈ టీ తాగడం ద్వారా రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి.
ఈ యాంటీఆక్సిడెంట్లు గుండె దమనుల్లో ఆరోగ్యకర కణాల పెరుగుదలకు సహకరిస్తాయి. లెమన్‌గ్రాస్‌లో పొటాషియం ఉండటంతో బీపీని తగ్గంచడంతో పాటు శరీరంలో రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. లెమన్‌గ్రాస్‌లో ఉండే ఔషధాలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని, రక్తనాళాల్లో వ్యర్దాలు పేరుకుపోకుండా చూస్తాయని జర్నల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
లెమన్‌గ్రాస్ టీ అధికంగా సేవిస్తే కొలెస్ట్రాల్ కూడా అదేస్ధాయిలో తగ్గుతుందని అధ్యయనం స్పష్టం చేసింది. ఇంకా లెమన్‌గ్రాస్ టీతో బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగవడం, రోగనిరోధక శక్తి పెరగడం వంటి పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఈ అధ్యయనం పేర్కొంది.