Health Tips : రోజూ ఓ యాపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చని దాదాపు ప్రతి ఇంట్లో వింటూ ఉంటాం. అంతటి పోషకాలు కలిగిన సూపర్ ఫ్రూట్ యాపిల్‌లో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. సమతుల ఆహారంలో కూరగాయలు, పప్పుధాన్యాలతో పాటు పండ్లకూ అత్యధిక ప్రాధాన్యత ఉంది. వీటిలో ఎర్రటి రంగులో ఉండే యాపిల్స్ పోషకాలను అందించడంలో అద్భుతమైన పండ్లని నిపుణులు సూచిస్తున్నారు.
తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన యాపిల్స్ రక్తంలో చక్కెర స్ధాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. అసలు మధుమేహం దరిచేరకుండానూ తొలుత నియంత్రిస్తుంది. యాపిల్, పియర్స్ పండ్లు తీసుకుంటే మధుమేహం ముప్పు 18 శాతం తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. యాపిల్‌లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలు, పాలీపెనాల్స్ శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
యాపిల్స్ తరచూ తీసుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా వీటిలో ఉండే పీచు పదార్ధాలతో త్వరగా ఆకలి వేయకుండా ఉండటం అధిక బరువు నియంత్రణకు ఉపకరిస్తుంది. ఇక యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.