మా బాబు వయసు మూడేండ్లు. ఏడాది నుంచీ రోజుకు మూడునాలుగుసార్లు టాయిలెట్‌కు వెళ్తాడు. కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు అవుతాయి. భోజనంలో తిన్న క్యారెట్ ముక్కల లాంటివి కూడా మలంలో కనిపిస్తూ ఉంటాయి. మిగతా విషయాల్లో బాగానే ఉంటాడు. ఈ ఒక్క విషయంలోనే మాకు ఆందోళనగా అనిపిస్తుంది. తగిన పరిష్కారం చెప్పగలరు.
మీరు చెప్పిన లక్షణాల ప్రకారం.. ఈ సమస్యను ‘టాడ్లర్స్ డెయిరీ’ అంటారు. ఇది ఏ రకంగానూ ప్రమాదకరం కాదు. వయసు పెరిగేకొద్దీ దానంతట అదే తగ్గిపోతుంది. మనం తీసుకునే ఆహారం.. పొట్ట, చిన్నపేగు, పెద్దపేగు.. ద్వారా ప్రయాణిస్తుంది. ఆహారం చిన్న పేగులో, నీళ్లు పెద్దపేగులో శోషణ చెందుతాయి. కానీ చిన్న పిల్లల్లో పెద్దపేగు అంత సమర్థంగా పనిచేయదు. దీంతో నీళ్లు అలానే మిగిలిపోతాయి. అవే విసర్జన సమయంలో బయటికి వస్తాయి. ఈ రూపంలో పోషక విలువలు బయటికి పోతున్నాయనే భయం అవసరం లేదు.
ఎందుకంటే, మీ బాబులో పోషక విలువల లోపానికి సంబంధించి ఏ చిన్న లక్షణం కూడా కనిపించడం లేదు. ఎత్తు, బరువు చక్కగా ఉన్నాయి. విరేచనాలకు రకరకాల కారణాలు.. కొవ్వు పదార్థాలు మరీ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు అధికంగా ఇవ్వడం వల్ల ఇలా జరగవచ్చు. కాబట్టి పాలు, పెరుగు పుష్కలంగా పెట్టండి. పండ్ల రసాల్లోని చక్కెర పదార్థాలు కూడా ఈ సమస్యకు కారణం. పండ్ల రసాలు అతిగా ఇవ్వకండి. కొంతమంది పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. ఇదీ ఓ కారణమే. ఫైబర్ ఎక్కువగా ఉన్న.. మక్కజొన్న, బీన్స్, ఆకుకూరలు మోతాదు మించినా ఇలానే జరుగుతుంది. కాబట్టి ఆహార సమతుల్యం అవసరం.