Rose Petals For Beauty | గులాబీ పువ్వులను కవులు అందానికి మారుపేరుగా వర్ణిస్తారన్న విషయం తెలిసిందే. గులాబీ పువ్వుల అంత అందంగా ఉన్నావని అంటుంటారు. అయితే వాస్తవానికి గులాబీ పువ్వులను వివిధ రకాల సౌందర్య సాధన ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు. గులాబీ పువ్వులను సబ్బులు, షాంపూలు, ఆయిల్స్, క్రీములు వంటి వాటి తయారీలో వాడతారు. ఇవి మన చర్మానికి, శిరోజాలకు సంరక్షణను అందిస్తాయి. అయితే ఆయా ఉత్పత్తులు అన్నీ కృత్రిమమైనవి. వాటిల్లో రసాయనాలు అధికంగా ఉంటాయి. కనుక అవి దీర్ఘకాలంలో మన చర్మానికి హాని చేస్తాయి. కనుక ఆయా ఉత్పత్తులను వాడడం కన్నా నేరుగా గులాబీ పువ్వులను వాడితేనే ఎక్కువ మేలు జరుగుతుంది. గులాబీ పువ్వులతో పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. దీంతో ముఖంపై ఉండే ముడతలు, మొటిమలు, మచ్చలను తగ్గించుకోవచ్చు. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా మారుతుంది.
మార్కెట్లో మనకు కంపెనీల్లో తయారు చేసిన రోజ్ వాటర్ లభిస్తుంది. కానీ దీన్ని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. గులాబీ పువ్వుల రెక్కలను సేకరించి నీటిలో వేసి 48 గంటల పాటు నానబెట్టాలి. దీంతో ఆ రెక్కలలో ఉండే సారం నీటిలోకి వెళ్తుంది. దీని వల్ల రోజ్ వాటర్ రెడీ అవుతాయి. ఈ వాటర్‌ను పలు చిట్కాలలో ఉపయోగించవచ్చు. లేదా నేరుగా కూడా వాడవచ్చు. ఈ వాటర్‌ను సీసాలో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించవచ్చు. ఇక ఈ వాటర్‌ను రాత్రి పూట ముఖానికి రాసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. దీంతో ఈ వాటర్ చక్కని టోనర్‌లా పనిచేస్తుంది. ముఖంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. చర్మానికి కాంతి లభిస్తుంది. అందంగా కనిపిస్తారు. అలాగే కాస్త గంధం తీసుకుని అందులో మెత్తగా చేసిన గులాబీ పువ్వుల రెక్కలు, రోజ్ వాటర్, కొన్ని చుక్కల తేనెను వేసి కలపాలి. దీంతో పేస్ట్‌లా మారుతుంది. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
రోజ్ వాటర్‌లో రెండు దూది ఉండల్ని నానబెట్టి అనంతరం వాటిని తీసి కళ్ల మీద ఉంచాలి. అలా పది నిమిషాల పాటు ఉంచిన తరువాత వాటిని తీసేయాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు చేయాలి. దీని వల్ల కళ్ల కింద ఉండే నల్లని వలయాలు తొలగిపోతాయి. ఇక పొడి చర్మం ఉన్నవారికి గులాబీ పువ్వుల రెక్కలు ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి కావల్సిన తేమను అందించి చర్మం మృదువుగా మారేలా చేస్తాయి. గులాబీ పువ్వుల రెక్కలను సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. కనుక చలికాలంలో వీటితో ఎంతో మేలు జరుగుతుంది. గులాబీ పువ్వుల రెక్కల్లో ఉండే సహజసిద్ధమైన నూనెలు చర్మాన్ని పొడిబారకుండా చూస్తాయి. దీంతో చలికాలంలో చర్మం పగలకుండా ఉంటుంది. గులాబీ పువ్వుల రెక్కలను మెత్తని పేస్ట్‌లా మార్చి అందులో కాస్త రోజ్ వాటర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుండడం వల్ల ముఖానికి తేమ లభించి మృదువుగా మారుతుంది. దీన్ని శరీరంలోని ఇతర భాగాలపై ఉండే చర్మంపై కూడా రాయవచ్చు. దీంతో చర్మం తేమగా మారి మృదువుగా ఉంటుంది.
గులాబీ పువ్వుల రెక్కల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చర్మం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. గులాబీ పువ్వుల రెక్కలతో సహజసిద్ధమైన సన్ స్క్రీన్ లోషన్‌ను తయారు చేసి కూడా వాడవచ్చు. ఇందుకు గాను గులాబీ పువ్వుల రెక్కలను మెత్తని పేస్ట్‌లా చేసి అందులో కీరదోస రసం, గ్లిజరిన్ వేసి కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని నిల్వ చేసుకుని అవసరం అనుకున్నప్పుడు వాడాలి. బయటకు వెళ్లినప్పుడు30 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలపై రాయాలి. ఇది సహజసిద్ధమైన సన్ స్క్రీన్ లోషన్ లా పనిచేస్తుంది. సూర్య కిరణాల బారి నుంచి, దుమ్ము, ధూళి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇక కొన్ని నీటిని తీసుకుని అందులో కొన్ని గులాబీ పువ్వుల రెక్కలు, కొన్ని బాదంపప్పును వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్క్రబర్‌లా వాడుకోవచ్చు. దీని వల్ల చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. పార్టీలకు రెడీ అయ్యే వరకు చక్కని లుక్‌లో కనిపిస్తారు. ఇలా గులాబీ పువ్వుల రెక్కలను సహజసిద్ధంగా ఉపయోగించి అందాన్ని పెంచుకోవచ్చు.