Apple Cider Vinegar | సాధారణంగా చాలా మందికి వెనిగర్ గురించి తెలిసే ఉంటుంది. దీన్ని వంటల్లో ఎక్కువగా వేస్తుంటారు. బేకరీ పదార్థాల తయారీలో వెనిగర్‌ను అధికంగా వాడుతారు. సాధారణ వెనిగర్ అయితే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలగవు. కానీ యాపిల్ సైడర్ వెనిగర్ అయితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాపిల్ పండ్లను పులియబెట్టి యాపిల్ సైడర్ వెనిగర్‌ను తయారు చేస్తారు. ఇది అనేక పోషకాలను, ఔషధ విలువలను కలిగి ఉంటుంది. మనకు అనేక లాభాలను అందిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో అసిటిక్ యాసిడ్ ప్రధాన సమ్మేళనంగా ఉంటుంది. ఇది మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను రోజూ తీసుకోడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
షుగర్ ఉన్నవారికి యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకుంటే శరీరం ఇన్సులిన్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అధికంగా బరువు ఉన్నవారు కూడా దీన్ని తీసుకుంటే మేలు జరుగుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. శరీరంలోని కొవ్వు కరిగేలా చేస్తుంది. కనుక బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజూ దీన్ని తాగుతుంటే ఉపయోగం ఉంటుంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌ను రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి. రోగకారక క్రిములను నిర్మూలిస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. యాపిల్ సైడర్ వెనిగర్ అంటే పులిసిన ఆహారం. కనుక ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది ప్రో బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆమ్లత్వం అధికంగా ఉంటుంది. కనుక దీన్ని నేరుగా తాగకూడదు. నీటితో కలిపి తాగాల్సి ఉంటుంది. దంతాలకు ఇది తగలకుండా తాగాల్సి ఉంటుంది. లేదంటే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌ను నేరుగా తాగితే ఆహార నాళంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక కచ్చితంగా నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను రోజుకు 15 నుంచి 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవచ్చు. దీన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఉదయం అల్పాహారానికి 30 నిమిషాల ముందు తాగాల్సి ఉంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ రోజంతా నియంత్రణలో ఉంటాయి. దంతాలకు తగలకుండా తాగాలంటే స్ట్రాను ఉపయోగించవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్‌ను నెమ్మదిగా తాగాలి. ఒకేసారి తాగేయకూడదు. ఇలా యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.