Tamarind Seeds | చింతపండును మనం రోజూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని పప్పు, పులుసు, చారు, రసం వంటి వంటల్లో వేస్తుంటారు. చింత పండు వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే చింత పండును ఉపయోగించే సమయంలో అందులో ఉండే గింజలను తీసేస్తారు. చింత గింజలను పడేస్తారు. కానీ ఆయుర్వేద ప్రకారం చింత గింజలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి అనేక వ్యాధులను నయం చేస్తాయి. చింత గింజలను ఆయుర్వేద వైద్య విధానంలో పలు ఔషధాలను తయారు చేసేందుకు, వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారు. చింత గింజల్లో అనేక పోషకాలు సైతం ఉంటాయి. ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఫైబర్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో అధికంగా ఉంటాయి. కనుక ఈ గింజలను తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
చింత గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. చింత గింజలు ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. అందువల్ల వీటిని తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చింత గింజలను తీసుకోవడం వల్ల పైత్య రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీంతో మనం తినే ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలు సక్రమంగా జీర్ణం అవుతాయి. చింత గింజలు షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం చింత గింజలను తినడం వల్ల వాటిల్లో ఉండే సమ్మేళనాలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
చింత గింజల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ గింజలను తింటుంటే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలు, మోకాళ్ల సమస్యలు ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. ఈ గింజలను తినడం వల్ల కీళ్లలో గుజ్జు పెరుగుతుంది. దీంతో కీళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ గింజల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి సహాయం చేస్తాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. చింత గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
చింత గింజల్లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల దంతాలకు ఎంతో మేలు చేస్తాయి. చింత గింజల పొడితో దంతాలను తోముకోవచ్చు. దీని వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఇక చింత గింజలను తినాలంటే పలు సూచనలను పాటించాల్సి ఉంటుంది. ముందుగా చింత గింజలను సేకరించి శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. తరువాత వాటిని పెనంపై వేయించాలి. అనంతరం పొట్టు తీసేయాలి. తరువాత వాటిని మెత్తని పొడిలా పట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. రోజులో ఏదైనా సమయంలో భోజనం చేసిన తరువాత 30 నిమిషాలు ఆగి ఈ నీళ్లను తాగాల్సి ఉంటుంది. అదే దంతాలకు అయితే ఈ పొడిని నీటితో కలిపి మెత్తని పేస్ట్‌లా మార్చి దాంతో తోముకోవచ్చు. ఇక కొందరు వేయించిన చింత గింజలను నేరుగా తింటారు. అలా కూడా తినవచ్చు. రోజూ గుప్పెడు మోతాదులో వీటిని తినవచ్చు. ఇలా చింత గింజలను వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.