బకెట్ నీళ్లు ఎత్తాలంటే మీనమేషాలు లెక్కపెడుతున్నారు. చేతికందే వస్తువునైనా ముందుకుసాగి పట్టుకోవాలంటే తెగ ఆలోచిస్తున్నారు. పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సాహసమూ చేయలేక పోతున్నారు. కారణం.. నడుము ఎక్కడ పట్టేస్తుందోనన్న భయం. వయసు పైబడిన వారైతే.. అయ్యో పాపం అనుకోవచ్చు. వయసులో ఉన్నవాళ్లూ దిలాసాగా నడుము వంచలేకపోతుండటం హెచ్చరికే!
నడుమునొప్పి… ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా వృద్ధులతోపాటు యుక్తవయసువారి నోటినుంచి కూడా ఎక్కువగా ఈ మాట వినిపిస్తున్నది. సాధారణంగా నడుమునొప్పికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అయితే చాలామందిలో నడుమునొప్పికి ప్రధాన కారణం మాత్రం వెన్నులో ఏర్పడే సమస్యలే అని చెప్పవచ్చు. నడుమునొప్పి వల్ల రోజువారీ పనుల్లో ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా, సమస్య తీవ్రమైతే సొంత పనులు చక్కబెట్టుకోవడమూ కష్టతరమయ్యే ప్రమాదం ఉంది. అయితే, గతంలో నడుమునొప్పి చికిత్సలో భాగంగా చేసే స్పైన్ ఓపెన్ సర్జరీ వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఏర్పడేవి. కానీ, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య విధానాల్లో ఒకటైన ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఈ సమస్యకు మంచి ఫలితాలను ఇస్తుందని అంటున్నారు వైద్యరంగ నిపుణులు. ఈ పద్ధతిలో దుష్ప్రభావాలు అంతగా ఉండవని చెబుతున్నారు.
వయసు రీత్యా వచ్చే మార్పులు వెన్నెముకపై ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి. ముఖ్యంగా వయసు పెరిగిన కొద్దీ ఎముకలు అరుగుదలకు గురవుతాయి. దీంతో వెన్నుపూసలోని నరంపై అరిగిన ఎముక ఒత్తిడి చేస్తుంది. ఈ రకంగా వెన్నుపూసలోంచి వెళ్లే నరం ఒత్తిడికి గురవడం వల్ల నడుమునొప్పితోపాటు కాళ్లు లాగడం, తిమ్మిర్లు పట్టడం, కొన్ని అడుగులు వేసిన వెంటనే కాళ్లు మొద్దుబారిపోవడం, మలమూత్ర విసర్జన చేసేటప్పుడు స్పర్శ తెలియకపోవడం, కాళ్లు లేదా చేతులు సరిగ్గా పనిచేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తీవ్రమైనప్పుడు వెన్నెముకకు శస్త్రచికిత్స అవసరం పడొచ్చు. అయితే, అన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. ఉదాహరణకు… వెన్నుపూసలో ఏర్పడే సమస్యల కారణంగా వచ్చే నడుమునొప్పి, ఇతర లక్షణాలు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు తీవ్రత ఆధారంగా మందులు, ఫిజియోథెరపీ లేదా కొన్ని రకాల ఇంజెక్షన్లతో చికిత్స అందిస్తారు. దీంతో సమస్య తగ్గితే ఎలాంటి సర్జరీ అవసరం పడదు. అలా కాకుండా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు లేదంటే మందుల ద్వారా సమస్య తగ్గకుంటే అప్పుడు శస్త్రచికిత్స తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది.
సాధారణంగా వయసు పెరిగేకొద్దీ ఎముకలు అరుగుదలకు గురవుతాయి. ఇలాంటప్పుడు వెన్నుపూసలోని నరంపై అరిగిన ఎముక ఒత్తిడి కలిగిస్తుంది. ఈ కారణంగా నడుమునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ, ఈ మధ్యకాలంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కూర్చునే విధానం సరిగ్గా లేకపోవడం, ధూమపానం లాంటి దుర్వ్యసనాల వల్ల చిన్నవయసులోనే వెన్ను సమస్యలు, నడుమునొప్పితో బాధపడుతున్న యుక్తవయస్కుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ముఖ్యంగా సుదీర్ఘ సమయంపాటు కూర్చుని పనిచేసే ఉద్యోగుల్లో ఈ లక్షణాలు అధికంగా ఉంటున్నాయి. ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చోవడం, సరైన పద్ధతిలో కూర్చోకపోవడం (ఎర్గొనామిక్స్) వల్ల చిన్నవయసులోనే నడుము నొప్పి వంటి సమస్యలు పీడిస్తున్నాయి.
సాధారణంగా నడుమునొప్పికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో వెన్నుపూస సమస్య ఒకటి. ఇది కాకుండా కిడ్నీల్లో రాళ్లు, క్లోమగ్రంథి (పాంక్రియాస్)లో ఏర్పడే సమస్యలు, కండరాల సమస్యలు కూడా నడుమునొప్పికి కారణాలుగా పేర్కొనవచ్చు. ఇక స్త్రీలలో అయితే రుతుక్రమ సమస్యల వల్ల కూడా నడుమునొప్పి తలెత్తే అవకాశాలు ఉంటాయి.
తీవ్రమైన నడుము నొప్పి, కాళ్లు పనిచేయకపోవడం, నడకలో ఇబ్బంది, నడుస్తున్నప్పుడు నడుము వంకరగా పెట్టడం, నడిచేటప్పుడు వేసుకున్న చెప్పులపై పట్టులేక ఊడిపోవడం, మలమూత్ర విసర్జనలో స్పర్శ తెలియకపోవడం లేదా సరిగ్గా రాకపోవడం వంటి లక్షణాలు ఉంటే సమస్య ప్రమాదకర దశకు చేరుకున్నట్లు భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ప్రతీ వెన్ను సమస్యకు సర్జరీ అవసరం ఉండదు. నడుమునొప్పి ఉన్న 90 నుంచి 95 శాతం మంది రోగులకు సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. సమస్య ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మందులు, ఫిజియోథెరపీ, వెన్నుపూస సంబంధిత వ్యాయామాలు, కొన్ని రకాల ఇంజెక్షన్లతో సమస్యను అధిగమించవచ్చు. అలా కాకుండా సమస్య తీవ్రమై, రోజువారీ పనులు చేసుకోవడమూ ఇబ్బందికరంగా మారినప్పుడు మందులు, ఫిజియోథెరపీ వంటి చికిత్సలతో ఫలితం లేకపోతే వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకోవడం ఉత్తమం. అంటే, లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ తప్పనిసరి.
వెన్నెముక సర్జరీలలో చాలా రకాలు ఉన్నాయి. గతంలో ఎక్కువగా ఓపెన్ సర్జరీనే చేసేవారు. దీనివల్ల రోగి కోలుకోవడానికి చాలాకాలం పట్టేది. ఒంటిపై పెద్దగాటుతోపాటు రోగి కొంతనొప్పితో బాధపడేవాడు. వీటన్నిటికి చెక్ పెట్టి రోగి త్వరగా కోలుకునేందుకు ప్రస్తుతం ‘ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ’ అందుబాటులోకి వచ్చింది. ఈ శస్త్రచికిత్స వల్ల నామమాత్రపు గాటు కారణంగా కణజాలం ఎక్కువగా దెబ్బతినదు. దీంతో సర్జరీ తరువాత రోగికి పెద్దగా నొప్పి ఉండదు. అంతేకాకుండా ఆపరేషన్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రోగిని నడిపించడం జరుగుతుంది. లక్షణాల ఆధారంగా సర్జరీ జరిగిన ఒక్క రోజులోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉంటాయి. సర్జరీ జరిగిన రెండుమూడు రోజుల్లోనే సొంత పనులు చేసుకోవచ్చు. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వల్ల రోగి అతి త్వరగా కోలుకుంటాడు. ఇదిలా ఉండగా 15- 20 ఏండ్ల కింద వెన్నుపూస సర్జరీ చాలా క్లిష్టంగా ఉండేది. దానివల్ల ఆపరేషన్ తర్వాత పలు రకాల దుష్ప్రభావాలు తలెత్తేవి. కానీ, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా దుష్ప్రభావాలను చాలావరకు అధిగమించారు. ఈ విధానం వల్ల దుష్ప్రభావాలు 1 శాతం కంటే కూడా తక్కువ అని చెప్పవచ్చు.