మనిషి శరీరానికి మెదడు సమన్వయ వ్యవస్థ లాంటిది. నడిపించినా, పరుగెత్తించినా, నవ్వించినా, ఏడిపించినా.. అదంతా మెదడు పనితనమే. కానీ మెదడులో ఏర్పడే గడ్డలు.. శరీరంలోని ఇతర భాగాలతో లంకెను తొలగించేస్తాయి. ఫలితంగా రోగి శారీరక, మానసిక స్థితిలో మార్పులొస్తాయి.ఆ గడ్డలు ఇతర భాగాలకూ విస్తరించవచ్చు. ఇంకొన్నిసార్లు ఇంకెక్కడో మొదలై మెదడు వరకూ చేరుకోవచ్చు.ఈ ప్రాణాంతక స్థితినే వైద్య పరిభాషలో బ్రెయిన్ ట్యూమర్ అంటారు.
బ్రెయిన్ ట్యూమర్లు రకరకాలు.
అతి చిన్నవి ఉంటాయి.
చాలా పెద్దవీ ఉంటాయి.
వాటి లక్షణాల ఆధారంగా కొన్ని ట్యూమర్లను ప్రారంభంలోనే గుర్తించవచ్చు. కొన్నిసార్లు పూర్తిగా విస్తరించాక కానీ ఉనికి వెల్లడి కాదు. తీరా వైద్యులను సంప్రదించి, రోగ నిర్ధారణ జరిగే సమయానికి ట్యూమర్ పెద్దదై పోతుంది. ఇతర భాగాలతో మెదడు సమన్వయం కోల్పోతుంది. కొన్ని ట్యూమర్లు క్యాన్సర్లుగా పరిణమించవచ్చు. ఒకటే గుడ్డిగుర్తు. మెదడులో ట్యూమర్ వల్ల ప్రభావితమైన ప్రాంతం, మిగిలిన భాగాల కంటే తక్కువ చురుగ్గా ఉంటుంది.
బ్రెయిన్ ట్యూమర్ అంటే..
మెదడు, దాని పరిసరాల్లో కణాల అసాధారణ పెరుగుదలే.. బ్రెయిన్ ట్యూమర్. మెదడు కణ జాలంలో, కణజాలానికి దగ్గరలో.. అంటే నరాలు, పీయూష గ్రంథి, పీనియల్ గ్రంథి, మెదడు ఉపరితలాన్ని కప్పి ఉంచే పొరల్లో కొన్నిసార్లు ట్యూమర్లు తలెత్తుతాయి. మెదడులో ప్రారంభమయ్యే కణుతులు.. ప్రాథమిక బ్రెయిన్ ట్యూమర్లు. కొన్నిసార్లు ఇతర భాగాల నుంచి కూడా వ్యాపిస్తాయి. ఇలాంటి వాటిని ‘సెకండరీ’ లేదా ‘మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్లు’ అని పిలుస్తారు. మళ్లీ.. ప్రాథమిక ట్యూమర్లలో
అనేక రకాలున్నాయి. వీటిలో క్యాన్సర్లు కాని వాటిని ‘నాన్ క్యాన్సరస్’ లేదా ‘బినైన్ బ్రెయిన్ ట్యూమర్లు’ అంటారు. ఇవి అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది. మిగిలిన బ్రెయిన్ ట్యూమర్లు.. అచ్చమైన మెదడు క్యాన్సర్లు. వీటిని ‘మాలిగ్నెంట్ ట్యూమర్లు’గా వ్యవహరిస్తారు. మెదడు క్యాన్సర్లు చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. మెదడు కణజాలంపై దాడి చేసి, సర్వనాశనం చేస్తాయి.
తొలి సంకేతాలివే..
చిన్న లక్షణాలే కావచ్చు. నిర్లక్ష్యం చేయలేం.
ఏ సంకేతాన్నీ వదలడానికి వీల్లేదు.
అనేక కారణాలు..
రేడియేషన్ నుంచి రక్షణ
Brain2
తల, మెడ భాగాలు రేడియేషన్‌కు గురైనప్పుడు సైతం మెదడులో కణుతులు తలెత్తుతాయి. కాబట్టి, అనవసరమైన సీటీ స్కాన్లను నివారించాలి. శరీరం రేడియేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. అతినీలలోహిత కిరణాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. మధ్యాహ్నం పూట సాధ్యమైనంత వరకూ నీడపట్టున ఉండాలి.
ఆరోగ్యకరమైన జీవితం: వ్యాయామం, సమతులాహారం చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
క్రమం తప్పని వైద్య పరీక్షలు: రెగ్యులర్ మెడికల్ చెకప్స్ వల్ల జన్యు పరమైన ఆరోగ్యం గురించి తెలుస్తుంది. ప్రాథమిక దశలోని రుగ్మతలు బయటపడతాయి. బ్రెయిన్ ట్యూమర్ల కారకాలను గుర్తించవచ్చు. వంశపారంపర్యమైన బ్రెయిన్ ట్యూమర్ల ఉనికిని కనిపెట్టవచ్చు. ఇందుకు జెనెటిక్ కౌన్సెలింగ్ ఎంతో ఉపయోగపడుతుంది.
దీటైన వైద్యం
మెదడులో బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడినంత మాత్రాన భయపడాల్సిన పన్లేదు. అనేక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. శస్త్రచికిత్స ద్వారా బ్రెయిన్ ట్యూమర్లను తొలగించడం అనేది ఓ ప్రాథమిక చికిత్స. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ, అవేక్ బ్రెయిన్ సర్జరీ లాంటి అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నిక్స్ ద్వారా కణుతుల దుష్ప్రభావాలను తగ్గించవచ్చు. ఫలితాలను మెరుగుపరచవచ్చు.
రేడియేషన్ థెరపీ: శరీరంలో క్యాన్సర్ కణాలను, ఇతర కణుతులను నిర్మూలించడానికి రేడియేషన్ థెరపీలో భాగంగా శక్తిమంతమైన బీమ్స్‌ను ఉపయోగిస్తారు. ప్రొటాన్ థెరపీ, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ (ఎస్ఆర్ఎస్) లాంటి అధునాతన రేడియేషన్ థెరపీలతో మరింత కచ్చితంగా కణుతులను లక్ష్యం చేసుకుని చికిత్స చేస్తారు. దీనివల్ల కణుతుల చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణజాలం నశించిపోయే అవకాశం తక్కువ.
కీమోథెరపీ: క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి ఔషధాలను ఉపయోగించడమే కీమోథెరపీ. చెడు ప్రభావాన్ని తగ్గించేలా బ్రెయిన్ ట్యూమర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకునే అధునాతన కీమోథెరపీ డ్రగ్స్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.
ఇమ్యునోథెరపీ: క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను ఉపయోగించుకోవడమే ఇమ్యునో థెరపీ. కొన్నిరకాలైన బ్రెయిన్ ట్యూమర్ల విషయంలో ఇమ్యునోథెరపీ మంచి ఫలితాలనే ఇస్తున్నది.
లక్షిత చికిత్స: దీన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు. ఈ పద్ధతిలో క్యాన్సర్ కణాల్లో కనిపించే ప్రత్యేకమైన జన్యు ఉత్పరివర్తనాలు లేదా ప్రొటీన్లు లక్ష్యంగా ఔషధాలను ఉపయోగిస్తారు. గ్లియోబ్లాస్టొమా లాంటి బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో టార్గెటెడ్ థెరపీలది కీలకపాత్ర.
క్లినికల్ ట్రయల్స్: క్లినికల్ ట్రయల్స్ ద్వారా కూడా.. బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సకు సంబంధించిన సరికొత్త, అధునాతన చికిత్సలు అందుబాటులో వస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త విధానాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటిని క్లినికల్ ట్రయల్స్ ద్వారా పరీక్షిస్తారు. మెదడులో కణుతులు ఉన్నవారు క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు.
బ్రెయిన్ ట్యూమర్ బాధితులు.. న్యూరోసర్జన్లు, న్యూరో ఆంకాలజిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు, ఇతర నిపుణులను సంప్రదిస్తే సమస్యకు తిరుగులేని పరిష్కారం లభిస్తుంది. అయితే, అన్ని బ్రెయిన్ ట్యూమర్లను నివారించలేమనే సంగతి గుర్తుంచుకోవాలి. మనం నియంత్రించలేని కారకాలు కూడా అనేకం ఉంటాయి. కాకపోతే, ఆ ప్రభావాలను తగ్గించుకునే దిశగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఆరోగ్య కరమైన జీవనశైలిని ఎంచుకోవడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్లు సహా అనేక రోగాల ముప్పును అడ్డుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు. పరిపూర్ణ జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
తొలిదశలోనే నిర్ధారణ-చికిత్స
Brain1
బ్రెయిన్ ట్యూమర్ ప్రమాద సంకేతాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి. తొలిదశలోనే వ్యాధి నిర్ధారణ జరిగిపోయి, చికిత్స ప్రారంభిస్తే.. వ్యాధి మరింత ముదరకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో ఎన్నో అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. చికిత్స అనేది.. ట్యూమర్ లక్షణం, పరిమాణం, దశ, రోగి వయసు, ఆరోగ్య చరిత్ర.. తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
డాక్టర్ రవి సుమన్ రెడ్డి
సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్.