ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాక సంచలనం. వినియోగం ప్రభంజనం. సృష్టించిన ఉద్యోగుల పాలిట శాపం. అంతేకాదు వినియోగదారులకూ ఓ రోగమని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఏఐ ప్రభావం వల్ల మానసిక సమస్యలు వస్తున్నాయని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సాంకేతిక వినియోగం అన్ని రంగాల్లోకీ విస్తరించింది. ఇందులో సంభాషణ కోసం ఉపయోగించే చాట్బాట్ల వినియోగం మనుషుల ఆలోచన, ప్రవర్తనపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నదని గుర్తించారు.
సోషల్ మీడియా కంటెంట్‌కి భిన్నంగా ఆ వ్యక్తి అవసరం, ఆసక్తికి అనుగుణంగా సమాచారాన్ని సేకరించి ఇచ్చే చాట్బాట్లతో సంభాషణల్లో వక్రీకరణ, అర్ధ సత్యాలే ఉంటాయని ఇంతవరకూ గుర్తించారు. చాట్బాట్లు మనిషికి ఒక తోడులా సలహాలూ కూడా ఇస్తున్నాయి. ఈ డిజిటల్ సాహచర్యం మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది.
కొంతమంది మానసికవ్యాధులకు ఏఐ చాట్బాట్ల వినియోగం కారణమవుతుందని కొన్ని అధ్యయనాలు గుర్తించాయి. ఈ చాట్బాట్లు చెప్పే ముచ్చట్లూ ఆత్మహత్యల్ని ప్రేరేపిస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. చాట్బాట్లు చెప్పే విషయాలు వినియోగదారులను ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయి, ఎంతమందిపై ఏ స్థాయిలో వీటి ప్రభావం ఉందో తెలుసుకునేందుకు ఇప్పటి వరకు కచ్చితమైన అధ్యయనాలు జరగలేదు. అందువల్ల ఏఐ చాట్బాట్ల ముచ్చట్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.