ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ ఎంత ఎక్కువ విడుదలైతే జీవితంలో అంత రిస్క్‌ని ఎదుర్కోవాలి. సాధారణంగా ఈ హార్మోన్ ఉదయం పూట ఎక్కువ స్థాయిలో ఉండి, రాత్రిపూట తక్కువ స్థాయికి చేరుకుంటుంది. అందువల్ల నిద్రపోవడం, మేల్కొనడం, పనుల్లో చురుకుదనం వంటి చర్యలను ఒక పద్ధతి ప్రకారం ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర నియంత్రణ, వ్యాధినిరోధకతపై కూడా పరోక్షంగా ప్రభావం చూపుతుంది. ఒబేసిటీ, రక్తపోటుకు కారణమవుతుంది.
ఒక్క కార్టిసోల్ హోర్మోన్ పెరిగిందంటే ఇన్ని సమస్యలు వచ్చినట్టే. నిద్రలేమి, ఒత్తిడి, చికాకుగా ఉంటే వెంటనే కార్టిసోల్ని తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రాకుండా ఉండాలంటే ఈ మూడు అలవాట్లతో జీవితాన్ని ఆనందంగా గడిపేయండి.
1. ప్రతి రోజూ ఉదయం వ్యాయామం చేయండి. లేకపోతే శారీరక శ్రమకు సిద్ధం కావాలి. ఇలా చేయడం వల్ల ఉదయం పూట కార్టిసోల్ తక్కువగా ఉంటుంది. సాయంత్రానికి ఇంకా తగ్గుతుంది. కాబట్టి రాత్రి వేళ మంచి నిద్రపడుతుంది. కార్టిసోల్ చాలా తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం నిద్రపోవడానికి దోహదపడుతుంది.
2. దీర్ఘ శ్వాసతో ఊపిరితిత్తుల్లో గాలిని బంధించడం సాధన చేయాలి. ఉచ్ఛాస, నిశ్చాస సమయాల్లో శరీరంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉండాలి. ఇలా పలుమార్లు సాధన చేస్తే రక్తంలో కార్టిసోల్ విడుదల తగ్గి, ఉల్లాసంగా ఉంటారు.
3. ఒత్తిడి భారాన్ని తగ్గించి, మనోల్లాసాన్ని పొందడానికి కార్టిసోల్ని ఎలా తగ్గించుకోవాలో అలాగే ఎండార్ఫిన్ని ఎక్కువ విడుదలయ్యేలా చేయాలి. నవ్వు పుట్టించే, సంతోషం కలిగించే కార్యక్రమాల్లో భాగస్వామ్యం పెంచుకోవాలి.