మా అబ్బాయి వయసు తొమ్మిది నెలలు. అప్పుడప్పుడు.. ఒక్కసారిగా ఏడ్వడం మొదలుపెడతాడు. అప్పుడు బాగా ఇబ్బందిపడతాడు. ఓసారి హాస్పిటల్‌కి తీసుకుపోయాం. గ్యాస్ట్రిక్ సమస్య ఉందేమోనని మందులు ఇచ్చారు. కొంత ఉపశమనం ఉంది. కానీ, మళ్లీ మళ్లీ అలానే అవుతున్నది. కొన్నాళ్ల తర్వాత మలంలో రక్తం పడటం గమనించాం. కంగారుపడి హాస్పిటల్‌కి వెళ్లాం. స్కాన్ చేసి పేగులు మడతపడ్డాయని చెప్పారు. మా అబ్బాయికి ఇన్టు ససెప్షన్ సమస్య ఉందని చెప్పారు. వెంటనే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకుపోయారు. కొంత ప్రొసీజర్ చేసి తగ్గించారు. ఇలా ఎందుకు జరిగింది. మళ్లీ ఈ సమస్య రావచ్చా?
ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పిల్లల్లో పేగు ఒక భాగం ఇంకొక భాగంలోకి వెళ్తుంది. దానిని ఇన్టు ససెప్షన్ అంటారు. ఒక పేగు మరో పేగులోకి పోతే ఆ చొచ్చుకుపోయిన భాగంలో రక్త సరఫరా నిలిచిపోతుంది. అందుకే రక్తం కలిసిన మలం పడుతున్నది. ఇలా పడటాన్ని వైద్య పరిభాషలో రెడ్ కరెంట్ జెల్లీ స్టూల్ అంటారు. కొన్నిసార్లు ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవచ్చు. అలా తగ్గకపోతే ఆపరేషన్ థియేటర్లో హైడ్రోస్టాటిక్ ప్రెజర్ చేస్తారు. ఈ పద్ధతిలో పేగుల్లోకి ద్రవాలను పంపి, పీడనం పెంచడం ద్వారా చొచ్చుకుపోయిన పేగులను సరిచేస్తారు. ఇలాచేసిన తర్వాత ఆ సమస్య మళ్లీ వచ్చే ప్రమాదం తక్కువ. కానీ, అసలే రాదని చెప్పలేం.
చిన్న పేగులు అన్నీ కూడా ట్యూబుల్లా ఉంటాయి. ఒక భాగం ఇంకో భాగంలోకి పోయినప్పుడు పేగులు టెలిస్కోప్‌లోని పైపుల్లా ఉంటాయి. ఇలా అయినప్పుడు పేగుల్లో పైనుంచి కిందికి పోవాల్సిన ఆహార పదార్థాలు చలనం లేకుండా నిలిచిపోతాయి. ఆ సందర్భంలో వాంతి అవుతుంది. టెలిస్కోపింగ్ వల్ల రక్త సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల ఇన్టు ససెప్షన్ జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో కొన్నిసార్లు కారణం తెలియదు. కానీ కొన్నిసార్లు లక్షణాల ఆధారంగా సమస్యను ముందే తెలుసుకోవచ్చు. కడుపు ఉబ్బరం, మళ్లీ మళ్లీ ఏడ్వడం, వాంతులు, మలంలో రక్తం, నీరసం… ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. కొందరు వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య బారినపడతారు. ఇలాంటప్పుడు పేగుల్లో ఉండే గ్రంథుల్లో వాపు సంభవిస్తుంది. దీనివల్ల ఒక పేగులోకి మరో పేగు చొచ్చుకుపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్