నవతరం జనాభాలో క్యాన్సర్ కేసులు ఇంతలంతలుగా పెరిగిపోతున్నాయి. 1980వ దశకం తర్వాతి తరం క్యాన్సర్ బారినపడటానికి అనేకానేక కారణాలు ఉన్నాయి. ఊబకాయం, నాసిరకం ఆహారం, పర్యావరణ కారకాలు, వ్యాయామం లేకపోవడం, తగినంత నిద్ర లేకపోవడంతో సంబంధం ఉందంటున్నారు నిపుణులు. లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం నవతరం వారిలో 17 రకాల క్యాన్సర్లు పెరిగిపోతున్నట్టు వెల్లడైంది. ఇక క్యాన్సర్ రావడానికి జన్యుపరమైన, పర్యావరణ పరమైన కారణాలతోపాటు జీవనశైలి కూడా కారణమవుతున్నది. కాబట్టి, ఈ దిశగా మన రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు
ఇటీవలి కాలంలో ఊబకాయంతో ముడిపడిన క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అధిక బరువు కారణంగా పేగు విసర్జక వ్యవస్థకు సంబంధించిన కొలరెక్టల్, గర్భాశయ లోపలి పొర (ఎండోమెట్రియల్), కిడ్నీ, అన్నవాహిక, క్లోమగ్రంథి, కాలేయం, పిత్తాశయ క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించి బరువు తగ్గించుకోగలిగితే క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది.
శాకాహార విధానం
గింజలు, పండ్లు, ముతక ధాన్యాలు, టోఫు, చిక్కుళ్లు వంటి మొక్కల నుంచి వచ్చే ఆహారం క్యాన్సర్‌ను ఆమడదూరంలో ఉంచుతుంది. ఓ అధ్యయనం ప్రకారం మొక్కల ఆధారిత ఆహారం క్యాన్సర్ వచ్చే ముప్పును 47 శాతం తగ్గిస్తుందని తేలింది. పండ్లు, కూరగాయలు, గింజలు, ఆలివ్ నూనె వాడకం ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్న పురుషులు వ్యాధి ముదరడాన్ని తగ్గించుకోవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది.
ఎక్కువసేపు కూర్చోవద్దు
రోజులో 10 నుంచి 12 గంటలపాటు ఒకే దగ్గర కూర్చోవడం, తగినంత శారీరక శ్రమ చేయకపోవడం కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. శారీరకంగా చురుగ్గా ఉండేవారితో పోలిస్తే ఒకే దగ్గర కూర్చుని గడిపేవాళ్లలో క్యాన్సర్‌తో మరణించే ముప్పు 82 శాతం ఎక్కువని ఎండీ ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ తెలిపింది.
ప్రాసెస్డ్ ఆహారం వద్దు
చిప్స్, బర్గర్లు, పిజ్జా, కోలా, సమోసాలు మన జీవితంలో భాగమైపోయాయి. అయితే, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో చక్కెరలు, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ క్యాలరీలు, తక్కువ పోషకాలు ఉండే ఇలాంటి ఆహారం కారణంగా ఊబకాయం బారినపడతాం. ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.
ఫైబర్ ఎక్కువగా
ఎక్కువ కొవ్వు, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు మన ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతాయి. పొట్ట (బోవెల్), ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, గర్భాశయం (యూటరైన్) సహా ఎన్నో క్యాన్సర్లకు కారణమవుతాయి. కాబట్టి, ఫైబర్ సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు, గింజలు తినాలి. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలి.
ఎండలో గడపొద్దు
ఎండ ఎక్కువగా ఉండే మధ్యాహ్న వేళలో బయటికి వెళ్లొద్దు. ఈ సమయంలో సూర్యుడి కిరణాల వల్ల అల్ట్రా వయోలెట్ రేడియేషన్‌కు గురవుతాం. ఇది మన చర్మ కణాల్లో ఉండే డీఎన్ఏను ధ్వంసం చేస్తుంది. చర్మ క్యాన్సర్‌కు కారణమవుతుంది. అందువల్ల మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బయటికి వెళ్లాల్సి వస్తే ఎండ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటి తిండే మంచిది
ఇంటి తిండి అయితే మనకు నచ్చినట్టుగా, ఆరోగ్యకరంగా, పరిశుభ్రంగా, తాజాగా చేసుకుంటాం. ఆయుర్వేదం కూడా అప్పుడే వండుకున్న ఆహారం తింటే మంచిదని చెబుతున్నది. ఇంటి వంటలోనూ క్యాలరీలు తక్కువ, ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. క్యాన్సర్ సహా ఎన్నో రోగాలు ఇంటి భోజనంతో పరారవుతాయి.