న్యూఢిల్లీ : శారీరక ఆరోగ్యం కోసం అన్ని విటమిన్ల తరహాలోనే విటమిన్ డీ కూడా అంతే కీలకం. విటమిన్ డీ1, విటమిన్ డీ2, విటమిన్ డీ3 విటమిన్ డీ గ్రూపులో ఉంటాయి. సూర్యరశ్మి నుంచి విటమిన్ డీ సహజసిద్ధంగా లభిస్తుంది. కొన్ని ఆహార పదార్ధాల ద్వారా కూడా విటమిన్ డీని పొందవచ్చు. శరీరంలోని భిన్న అవయవాలు సవ్యంగా పనిచేయాలంటే విటమిన్ డీ అత్యవసరం.
విటమిన్ డీ లోపిస్తే తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉండటంతో దీన్ని నివారించేందుకు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడంతో పాటు విటమిన్ డీ ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఎండ తగిలేలా చూసుకోవాలి. విటమిన్ డీ లోపిస్తే రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు ఎముకలు, కండరాల నొప్పులు, మధుమేహం, గుండె జబ్బుల ముప్పు పొంచిఉంటుంది.
విటమిన్ డీ తగినంత ఉంటే మధుమేహం, అర్ధరైటిస్, గుండెజబ్బులు దరిచేరకుండా చూసుకోవచ్చు. బరువు తగ్గడంలోనూ విటమిన్ డీ చురుకుగా వ్యవహరిస్తుంది. విటమిన్ డీ లోపం లేకుండా ఉంటే ఇది లెప్టిన్ హార్మోన్ పనితీరును ప్రేరేపించి కడుపు నిండిన భావనను కలిగించడంతో బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. ఇక విటమిన్ డీ శరీరం క్యాల్షియం గ్రహించే శక్తిని మెరుగుపరుస్తుంది. విటమిన్ డీ పుష్కలంగా ఉండే కోడిగుడ్డు, పాలు, చికెన్ వంటి ఆహారాన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.