Sleeping | ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి. స్మార్ట్ఫోన్లు పావు వంతు నిద్రను లాగేసుకుంటే.. సోషల్ మీడియా సగం నిద్రను గుంజేసుకుంది. ఓటీటీ రాకతో కలత నిద్ర కలవరపెడుతున్నది. నిద్రలేమి కారణంగా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కంటి నిండా నిద్రపోవాలంటే.. సరైన ఆహార పదార్థాలు, సకాలంలో తినాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి మంచి నిద్రను అందించేది మెలటోనిన్ హార్మోన్. ఇది సరైన సమయంలో విడుదల కావడం వల్ల నాణ్యమైన నిద్ర పడుతుంది. మెదడులో ఉండే పీనియల్ గ్రంథి దీనిని ఉత్పత్తి చేస్తుంది.
టార్ట్ చెర్రీలు తినడం ద్వారా మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. టార్ట్ చెర్రీ జ్యూస్ తాగినా గుణం కనిపిస్తుంది. రెగ్యులర్గా కోడి గుడ్లు తినడం వల్ల కూడా శరీరానికి సరిపడా ఇది అందుతుంది. గుడ్డులోని పోషకాలు నాణ్యమైన నిద్రకు ఉపకరిస్తాయి. గోరువెచ్చని పాలు తాగితే మెలటోనిన్ అధికంగా విడుదలవుతుంది. అడపాదడపా బాదం, పిస్తా తినడం ద్వారా ఈ హార్మోన్ ఉత్పత్తి సజావుగా సాగుతుంది. సాల్మన్, సార్డిన్ వంటి చేపలు తిన్నా కూడా ఇది లభిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా నాణ్యమైన నిద్రను అందేలా చేస్తాయి. అన్నిటికీ మించి నాణ్యమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్గా వాకింగ్, వ్యాయామం చేస్తే మనం పిలవకుండానే నిద్రాదేవి సకాలంలో ఆవహిస్తుంది.