Kidneys Clean | మన శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కిడ్నీలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. దీంతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాము. అయితే మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, దీర్ఘకాలిక వ్యాధులు, వాడే మందులు వంటి కారణాల వల్ల మన కిడ్నీల పనితీరు మందగిస్తుంది. దీంతో వ్యర్థాలను కిడ్నీలు సరిగ్గా బయటకు పంపలేకపోతాయి. దీని వల్ల దీర్ఘకాలంలో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇవి అనేక వ్యాధులను కలగజేస్తాయి. అందువల్ల కిడ్నీలను మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కిడ్నీలు ఎప్పటికప్పుడు వ్యర్థాలను బయటకు పంపిస్తూ శుభ్రంగా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కిడ్నీలను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీని వల్ల ఇతర వ్యాధులు రాకుండా కూడా అడ్డుకోవచ్చు.
మనం బీట్రూట్ను అప్పుడప్పుడు తింటుంటాం. కానీ బీట్రూట్ను రోజువారి ఆహారంలో కచ్చితంగా భాగం చేసుకోవాలి. బీట్ రూట్లో పొటాషియం, నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలను శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ ఒక కప్పు బీట్ రూట్ ముక్కలను తింటుండాలి. లేదా ఒక కప్పు బీట్ రూట్ జ్యూస్‌ను అయినా తాగవచ్చు. దీని వల్ల కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే కిడ్నీల ఆరోగ్యానికి నిమ్మరసం కూడా ఎంతగానో పనిచేస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది కిడ్నీలను శుభ్రం చేస్తుంది. కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. కిడ్నీల పనితీరు మెరుగు పడేలా చేస్తుంది. అదేవిధంగా అల్లం రసం కూడా ఎంతగానో మేలు చేస్తుంది. రోజూ ఉదయం పరగడుపునే అల్లం రసాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. దీని వల్ల కిడ్నీలు క్లీన్ అవడమే కాదు, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గేందుకు కూడా అల్లం రసం పనిచేస్తుంది.
కొబ్బరినీళ్లను రోజూ తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల శిరోజాలు, చర్మం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కిడ్నీ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. కొబ్బరినీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్ కిడ్నీలను సురక్షితంగా ఉంచుతాయి. అయితే వీటిని రోజుకు 1 గ్లాస్ కు మించి తాగకూడదు. అలాగే కిడ్నీల ఆరోగ్యానికి యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పనిచేస్తుంది. రోజూ ఉదయం పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగుతుంటే కిడ్నీలు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బరువు తగ్గేందుకు కూడా ఇది ఎంతగానో పనిచేస్తుంది. షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను సైతం అదుపులో ఉంచుతుంది. ఇక కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు గాను పలు పండ్లు కూడా సహాయం చేస్తాయి. స్ట్రాబెర్రీలు, చెర్రీలు, యాపిల్స్, క్రాన్ బెర్రీలు, ద్రాక్ష, పైనాపిల్ వంటి పండ్లను తింటుంటే మేలు జరుగుతుంది.
అరటి పండ్లు, నారింజ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని సోడియం స్థాయిలను తగ్గిస్తుంది. దీని వల్ల కిడ్నీలు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కాలిఫ్లవర్, క్యాబేజీ, ఎరుపు రంగు క్యాప్సికం, ముల్లంగి వంటి కూరగాయలను తింటున్నా కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కోడిగుడ్డు తెల్ల సొన, స్కిన్ లెస్ చికెన్, చేపలు, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహారాలను కూడా తీసుకోవచ్చు. అయితే కిడ్నీలు ఎల్లప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేందుకు గాను ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. సోడియం తక్కువగా ఉండే ఆహారాలను తినాలి. మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. ఆకుకూరలు, కూరగాయలను, పండ్లను తినేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. అలాగే రోజూ నీళ్లను తగిన మోతాదులో తాగాలి. ఇలా ఆహారపు అలవాట్లను పాటిస్తుంటే కిడ్నీలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి.