Tea And Coffee | ఉదయం చాలా మంది బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. కొందరు ఉదయం పరగడుపునే టీ, కాఫీతో మొదలు పెడతారు. అలా తాగనిదే వారికి రోజు గడిచినట్లు అనిపించదు. ఇంకా కొందరు రోజు మొత్తం మీద టీ, కాఫీలను అదే పనిగా తాగుతూనే ఉంటారు. అయితే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత టీ లేదా కాఫీలను తాగేవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తిన్న తరువాత టీ లేదా కాఫీ తాగకూడదు. మనలో చాలా మందికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ కొన్ని బ్రేక్‌ఫాస్ట్‌లను తింటే మాత్రం ఈ రెండింటినీ అసలు తాగవద్దు. ఇక ఏయే ఆహారాలను తిన్నాక టీ, కాఫీలను తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం చాలా మంది పరాఠాలను తింటుంటారు. ఇది చాలా హెవీ అయిన బ్రేక్‌ఫాస్ట్. అయితే పరాఠాలను తిన్న తరువాత టీ లేదా కాఫీ తాగకూడదు. తాగితే మన శరీరం మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను శోషించుకోలేదు. దీంతో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే పరాఠా చాలా హెవీ ఫుడ్ కిందకు వస్తుంది. కనుక ఉదయం పరాఠాలను తిన్న వెంటనే నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఉదయం పరాఠాలను తీసుకోరాదు. తిన్నా కూడా టీ తాగరాదు. ఇక చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వైట్ బ్రెడ్‌ను తింటుంటారు. దీన్ని తరువాత వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. అయితే ఇలా తాగడం వల్ల షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో ఇది టైప్ 2 డయాబెటిస్‌కు కారణం అవుతుంది. కనుక వైట్ బ్రెడ్‌ను తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగకూడదు.
ఉదయం కొందరు చాక్లెట్లను తింటుంటారు. తరువాత టీ లేదా కాఫీ తాగుతారు. వాస్తవానికి వీటిని రెండింటినీ వెంట వెంటనే తినడం అంత మంచిది కాదు. జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది. పొట్టంతా అసౌకర్యంగా ఉంటుంది. కొందరికి అలర్జీలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ కాంబినేషన్ కూడా పనికిరాదు. అలాగే కొందరు చక్కెర, మైదా అధికంగా ఉండే కార్న్ ఫ్లేక్స్ వంటి సిరియల్స్ను అధికంగా తింటుంటారు. తరువాత టీ, కాఫీ తాగుతారు. ఇలా చేసినా కూడా మనకు అనారోగ్యకరమే. ఈ కాంబినేషన్ వల్ల కూడా టైప్ 2 డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉంటుంది. కనుక వీటిని తిన్న వెంటనే కూడా టీ, కాఫీలను తాగరాదు.
ఉదయం కొందరు అరటి పండ్లను తిన్న తరువాత టీ, కాఫీలను తాగుతుంటారు. కానీ ఈ కాంబినేషన్ కూడా పనికిరాదు. ఈ రెండింటినీ వెంట వెంటనే తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది. పొట్టంతా ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొందరికి కడుపులో నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీటిని కూడా కలిపి తీసుకోరాదు. అలాగే నిమ్మజాతికి చెందిన పండ్లను తిన్న వెంటనే కూడా టీ, కాఫీలను తాగకూడదు. ఈ ఫుడ్ కాంబినేషన్ కూడా పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఉదయం వేపుళ్లను తినడం వల్ల పొట్టలో హెవీగా ఉండి అసౌకర్యం ఏర్పడుతుంది. అలాంటప్పుడు టీ లేదా కాఫీ తాగితే అసౌకర్యం మరింత పెరుగుతుంది. కనుక ఈ ఆహారాలను కూడా కలిపి తీసుకోరాదు. ఇలా పలు ఆహారాలను తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం మానుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.