Red Color Spinach | మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. పాలకూరను తింటే అనేక పోషకాలు కూడా లభిస్తాయి. అయితే పాలకూర పేరు చెప్పగానే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకులే ఊహకు వస్తాయి. కానీ మీకు తెలుసా ? ఇందులోనూ అనేక వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో ఎర్ర పాలకూర కూడా ఒకటి. ఇది ముదురు ఊదా రంగులోనూ ఉంటుంది. మార్కెట్లో మనకు ఈ పాలకూర కూడా లభిస్తుంది. ఎరుపు రంగు పాలకూరలో ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అందుకనే ఆ కూరకు ఎరుపు రంగు వస్తుంది. ఆకుపచ్చ రంగు పాలకూరలాగే ఎరుపు రంగు పాలకూర కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఎరుపు రంగు పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో బీటా సయనిన్స్, ఆంథో సయనిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆకుపచ్చ పాలకూరలో ఉండవు. అందువల్ల ఎరుపు రంగు పాలకూరను తింటే యాంటీ ఆక్సిడెంట్లను అధిక మొత్తంలో పొందవచ్చు. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే వృద్ధాప్య చాయలు తగ్గుతాయి. ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఈ పాలకూరను తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో అంతర్గతంగా ఏర్పడే వాపులు తగ్గుతాయి. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఎరుపు రంగు పాలకూరలో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ వల్ల రక్త నాళాలపై పడే ఒత్తిడి తగ్గి రక్త నాళాలు ప్రశాంతంగా మారుతాయి. రక్త నాళాలు వెడల్పు అవుతాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల గుండెపై పడే భారం తగ్గుతుంది. ముఖ్యంగా బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు ఈ పాలకూరను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఈ పాలకూరను తింటే శరీరంలోని కణాలకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా లభిస్తాయి. దీంతో నీరసం, అలసట తగ్గుతాయి. ఈ పాలకూరను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు ఎరుపు రంగు పాలకూర జ్యూస్‌ను తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. మళ్లీ యాక్టివ్‌గా పనిచేస్తారు. శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కండరాలకు మరమ్మత్తులు జరుగుతాయి. కండరాలు త్వరగా కోలుకుని శక్తిని పుంజుకుంటాయి. దీంతో మళ్లీ దృఢంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. ఎరుపు రంగు పాలకూరలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాలకూర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఇలా ఎరుపు రంగు పాలకూరతో అనేక లాభాలను పొందవచ్చు. కనుక దీన్ని తరచూ తినాలి.