Red Color Foods | ప్రకృతిలో మనకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిని మనం తయారు చేసుకుని తింటాం. కొన్ని సహజసిద్ధంగా లభిస్తాయి. పండ్లు, కూరగాయల వంటివి ఈ కోవకు చెందుతాయి. అయితే భిన్న రకాల రంగుల్లో ఉండే ఆహారాలను తరచూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అలా తింటే పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. అలాగే వ్యాధులు సైతం తగ్గిపోతాయి. ఈ క్రమంలోనే ఎరుపు రంగులో ఉన్న ఆహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తింటే అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు. టమాటాలు, యాపిల్స్, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, చెర్రీలు, ఎరుపు రంగు క్యాప్సికం.. ఇలా ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తరచూ తినాలని వారు సూచిస్తున్నారు.
ఎరుపు రంగులో ఉండే ఆహారాల్లో లైకోప్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఆంథో సయనిన్స్, ఎల్లాజిక్ యాసిడ్, బీటాలెయిన్స్, క్వర్సెటిన్, హెస్పెరిడిన్, విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తింటే ఈ పోషకాలు అన్నీ మనకు లభిస్తాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎరుపు రంగు ఆహారాల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. వాపులు తగ్గుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ ఆహారాల్లో అధికంగా ఉండే లైకోపీన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉంటారు.
ఎరుపు రంగులో ఉండే ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఫైటో కెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. ముఖ్యంగా ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్స్ వంటి క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ ఆహారాల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఈ ఆహారాల్లో ఉండే లైకోపీన్, బీటా కెరోటిన్లు కళ్లను సంరక్షిస్తాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి సమస్యలు ఉన్నవారు ఎరుపు రంగులో ఉన్న ఆహారాలను తరచూ తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది.
ఎరుపు రంగు ఆహారాల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను తింటే శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆహారాల్లో ఉండే బీటాలెయిన్స్ వల్ల వీటిని తింటే శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. శరీరం సహజసిద్ధంగా డిటాక్స్ అవుతుంది. అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ఈ ఆహారాల్లో ఉండే విటమిన్ సి, లైకోపీన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఎరుపు రంగు ఆహారాల్లో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది రక్తం తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. నీరసం, అలసట నుంచి బయట పడేలా చేస్తుంది. ఇలా ఎరుపు రంగులో ఉండే ఆహారాలను తరచూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.