Purple Color Cabbage | క్యాబేజీని సాధారణంగా చాలా మంది అంత ఇష్టంగా తినరు. దీని నుంచి వచ్చే వాసన కొందరిలో వికారాన్ని కలగజేస్తుంది. కనుక క్యాబేజీ అంటే పెద్దగా ఇష్టపడరు. కొందరు దీంతో వేపుడు, పప్పు, పచ్చడి చేసుకుంటారు. అయితే క్యాబేజీలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిల్లో ఆకుపచ్చ క్యాబేజీ, పర్పుల్ క్యాబేజీలను మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా చాలా మంది ఆకుపచ్చ క్యాబేజీ తింటారు. కానీ పర్పుల్ కలర్ క్యాబేజీని తినడం వల్ల కూడా ఎన్నో లాభాలను పొందవచ్చు. పర్పుల్ కలర్ క్యాబేజీని రెడ్ క్యాబేజీ అని కూడా పిలుస్తారు. ఇది బ్రస్సికా జాతికి చెందినది. బ్రోకలీ, కాలిఫ్లవర్ లు కూడా ఇదే జాతికి చెందుతాయి. పర్పుల్ కలర్ క్యాబేజీలో అధిక మొత్తంలో ఆంథో సయనిన్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్లే పర్పుల్ కలర్ క్యాబేజీ ఆ రంగులో ఉంటుంది. ఇక దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.
పర్పుల్ కలర్ క్యాబేజీని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. ఆంథోసయనిన్స్ ఇందులో అధిక మొత్తంలో ఉంటాయి. ఇది ఫ్లేవనాయిడ్స్ జాతికి చెందుతుంది. మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తుంది. ఈ క్యాబేజీలో విటమిన్ సి, కెరోటినాయిడ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. పర్పుల్ కలర్ క్యాబేజీని రోజుకు ఒక కప్పు మోతాదులో తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ సి దాదాపుగా లభిస్తుంది. విటమిన్ సి వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. పర్పుల్ రంగు క్యాబేజీలో ఉండే ఆంథో సయనిన్స్ కారణంగా బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్తనాళాల వాపులు తగ్గిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ క్యాబేజీలో ఉండే పొటాషియం బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఈ క్యాబేజీలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు, ఆర్థరైటిస్ రాకుండా చూస్తుంది. ఇందులో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులను తగ్గిస్తాయి.
పర్పుల్ రంగు క్యాబేజీలో విటమిన్ కె, క్యాల్షియం, మెగ్నిషియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ రాకుండా చూస్తాయి. ఈ క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మళనాలు క్యాన్సర్ రాకుండా చూస్తాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. ఇక పర్పుల్ రంగు క్యాబేజీని ఉడికించాల్సిన పనిలేదు. నేరుగా అలాగే తినవచ్చు. కానీ బాగా శుభ్రం చేసి తినాలి. దీన్ని నేరుగా తినలేమని అనుకుంటే తురుం లాగా పట్టి సలాడ్స్, ఇతర ఆహారాల్లో కలిపి తినవచ్చు. పచ్చిగా తినలేమని అనుకునేవారు ఈ క్యాబేజీతో సూప్ తయారు చేసి తాగవచ్చు. లేదా పెనంపై కాస్త వేయించి తినవచ్చు. ఈ విధంగా పర్పుల్ రంగు క్యాబేజీని తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.